ప్రపంచం చుట్టుతా ఓ రహదారిని నిర్మిస్తే...!?
posted on Jun 30, 2021 @ 9:30AM
భూమి గుండ్రంగా బంతి ఆకారంలో ఉందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఓ భూగోళాన్ని చుట్టివచ్చే ప్రయత్నం చాలామంది చేశారు. అయితే ఈ ప్రపంచం చుట్టుతూ ఒక రహదారిని నిర్మిస్తే ఎలా ఉంటుంది. భూమికి అడ్డంగా, భూమధ్య రేఖ వెంట ఒక పొడవైన రహదారిని ఉన్నట్లుగా ఊహించుకోండి.. ఇప్పటికైతే భూమధ్యరేఖ వెంట అలాంటి రహదారి లేదు. కానీ, నిర్మిస్తే ఎలా ఉంటుంది..? అయినా భూమిపై అంత పొడవైన రహదారిని ఎలా నిర్మిస్తాము? దీని పైన ప్రయాణించాలంటే ఎంత సమయం పడుతుంది? పర్యావరణానికి ఇది నష్టం చేస్తుందా ? ఒకవేళ ఇలాంటి రహదారిని నిర్మించినట్లయితే ఎలా ఉంటుంది. అది తెలియాలంటే కొన్ని విషయాలు మనం పరిశీలించాల్సిందే.
ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రోడ్లు కలిసి 64 మిలియన్ కిమీ (40 మిలియన్ మైళ్ళు ఉన్నాయని ఓ అంచనా. కానీ వీటిలో ఏ ఒక్క హైవే నెట్‌వర్క్ కూడా మిమ్మల్ని న్యూయార్క్ నుండి నేరుగా కేప్ టౌన్‌కు తీసుకెళ్లదు. కానీ మనం ఊహిస్తున్న రోడ్డు నిర్మాణం మనల్ని కొలంబియా నుండి ఇండోనేషియాకు సులభంగా తీసుకువెళుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రహదారి వ్యవస్థలతో అనుసంధానం చేసుకుంటే సులభంగా ప్రయాణించవచ్చు.
ఇది ఉహించడానికి బాగున్నా నిర్మాణం చేయాలంటే చాలా ఖరీదైన ఇంజనీరింగ్ ప్రక్రియ వలనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ రహదారిని ఎక్కువ భాగం నీటి అడుగున నిర్మించాల్సి ఉంటుంది. పైగా దీన్ని నిర్మించడానికి సగటున ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ దీన్ని ఏదో రహదారిని నిర్మించినట్లుగా నిర్మించలేం. 40,000 కిలోమీటర్ల పొడవైన రెండు లేన్ల ఈక్వటోరియల్ రహదారిని సాధారణ రహదారి వలె ఒకే సమయంలో వివిధ భాగాల్లో నిర్మించాల్సి ఉంటుంది. అన్నీ ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈ నిర్మాణం చేపట్టాలి అంటే సుమారు 8 మిలియన్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పనిచేయాలి. ఇందుకోసం 9.2 ట్రిలియన్లు డబ్బు ఖర్చు అవుతుంది.
మరీ, ఈ రహదారిపై ప్రయాణించడం ఎలా ఉంటుందనేగా..?
చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. భూమధ్యరేఖ వెంబడి 13 దేశాలను చుడుతూ, మూడు మహాసముద్రాల గుండా వెళుతుంది ఈ రహదారి. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ప్రారంభమై, కొలంబియా ద్వారా బ్రెజిల్‌కు తూర్పున ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం, అధిక టెంపరేర్లను చవిచూడాల్సి ఉంటుంది కాబట్టి యాత్రకు బయలుదేరే ముందు కారు ఎయిర్ కండిషనింగ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చూసుకొని బయలుదేరితే మంచిది. ఈ ప్రయాణం పర్వతాల గుండా, అమెజాన్ నది మీదుగా సాగుతుంది. ఒకవేళ ఈ మార్గంలో రిఫ్రెష్ కోసం ఈతకొట్టాలని అనుకుంటే అమెజాన్ నదిలో ఈతకు వెళ్ళవచ్చు. అమెజోనియన్ లో సాహసాలు చేయవచ్చు. ఆ తర్వాత బ్రెజిల్, అట్లాంటిక్ తూర్పు తీరం వెంట టన్నెల్ లో ప్రవేశిస్తారు. ఈ గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవాలంటే అట్లాంటిక్ సముద్రపు అడుగున నిర్మించిన టన్నెల్ లో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రయాణం కాస్త మందకొడిగా సాగుతుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆఫ్రికా ఖండంలోని భూమిని చూడటం సాధ్యమవుతుంది. సవన్నాల ద్వారా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. గబన్' కాంగో చిత్తడి నేలలు' దట్టమైన వర్షారణ్యం, కెన్యా , సోమాలియా ఎడారుల గుండా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో ఏనుగులను చూడవచ్చు. గొరిల్లాస్, గేదెలు, చిరుతపులు తారసపడతాయి. ఈ ప్రయాణం అట్లాంటిక్ మహా సముద్రం లోని సొరంగం ద్వారా సాగిన సుదీర్ఘ ప్రయాణం కంటే కూడా కాస్త ఎక్కువనే ఉంటుంది.
ఆ తర్వాత మరో టన్నెల్ లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సారి భారతీయ సొరంగా మార్గం గుండా ప్రయాణించాలి. ఆ తర్వాత మళ్ళీ ఇండోనేషియాలో భూమి కనిపిస్తుంది. ఇక్కడ భూమధ్యరేఖ చుట్టూ 17000 ద్వీపాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయు. ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి వెళ్ళడానికి చిన్న చిన్న సొరంగాల గుండా ప్రయాణం చేయాలి. సొరంగం నుండి భూమిపైకి వచ్చిన ప్రతిసారీ గంభీరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అగ్నిపర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వరి పొలాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు కనిపిస్తూ ప్రయాణాన్ని అద్భుతంగా మారుస్తాయి. ఈ లాంగ్ డ్రైవ్ లో బీచ్ లో ఎంజాయ్ చేయొచ్చు కూడా.
ఆ తర్వాత గ్రేట్ పసిఫిక్ సముద్రంలో నిర్మించిన సొరంగా మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది మూడు రెట్ల ప్రయాణం అనుకోవచ్చు. సుదీర్ఘంగా సాగే ఈ ప్రయాణం మొత్తం నీటి అడుగునే సాగుతుంది. ఆ తర్వాత ఉత్తేజపరిచేందుకు అన్నట్లుగా అద్భుతమైన గాలాపాగోస్ దీవులు దర్శనమిస్తాయి. ఇక్కడే జీవ పరిణామానికి చెందిన అనేక జంతు జీవజాలాలను, అసాధారణమైన జీవిత రూపాలను చూడవచ్చు. ఈ లాంగ్ డ్రైవ్ కన్నులపండుగ అనే చెప్పవచ్చు. ఆ తర్వాత చివరకు చిన్న నీటి అడుగున సొరంగం మార్గం ద్వారా మీరు కొంచెం దూరం వెళ్లితే ప్రయాణం ప్రారంభమైన ఈక్వెడార్‌లోనే మీ లాంగ్ వరల్డ్ టూర్ ముగుస్తుంది.
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఈ భూగోళం చుట్టూ ప్రయాణించడానికి 400 గంటల సమయం పడుతుంది. లేదా 17 రోజుల 17 గంటల సమయం అవుతుంది. ఇందులో దాదాపు 12 రోజులు సముద్రపు అడుగున సొరంగంలో ప్రయాణిస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొన్ని దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉండిపోతారు.
ఈ మొత్తం ప్రయాణ ప్రశాంతంగా, ఆస్వాదిస్తూ సాగాలంటే మీకు ఓ రెండు నెలల సమయాన్ని కేటాయిస్తే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ ఆలోచన చూడటానికి, వినటానికి బాగున్నా భూ గ్రహంపై అధిక వేడికి కారణం అవుతుంది. రహదారి నిర్మాణం కోసం భూమిపైన, సముద్రంలోపల పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అది కాకుండా ఈ యాత్రలో మీరు కారు సగటున సంవత్సరంలో విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ల కంటే కూడ దాదాపు రెండు రెట్లు ఎక్కువ విడుదల చేస్తుంది.
భూమధ్యరేఖ గుండా సాగే ఈ ప్రయాణం మనం ఎప్పటికీ చూడలేమేమో కానీ ఈ మార్గం గుండా ఎగిరే కార్లను నిర్మించడం సాధ్యమవుతుందేమో చూడాలి.