ప్రభుత్వ ముసుగులో ప్రై‘వేటు’ సేవలు?
posted on Oct 17, 2012 @ 9:51AM
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ప్రై‘వేటు’ ఆసుపత్రులు నడుపుతున్నారు. కొందరు వైద్యులు అనధికారికంగా ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను దారి మళ్లించి తమ ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. గుర్రం గుడ్డిదైతే...అన్న చందంగా అధికారులు అసమర్థతను వీరు ఆసరా చేసుకుని తమ నర్సింగ్‌హోమ్‌ల్లో రోగుల సంఖ్య పెంచుకుంటున్నారు. జిల్లా కలెక్టరు నీతుకుమారి ప్రసాద్ ఛైర్మనుగా ఉన్న ఈ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేదలకు సేవలందించటం మాటెలా ఉన్నా భయభ్రాంతులకు గురి చేస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రత్యేకించి తమ ఆసుపత్రిలో చేర్పించుకునేందుకు ఓ పిల్లల డాక్టర్ లేని రోగాలను అంటగడుతున్నాడు. డెంగ్యూ వ్యాధి లేకపోయినా సరే! పిల్లలను తన సొంత ఆసుపత్రికి షిఫ్ట్ చేయించి ప్రాణదాతగా పేరుగడించేందుకు తెరతీశారు. వాస్తవానికి డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా(ఎంజైమ్ లింక్డ్ ఎమ్యూన్ సార్బంట్) టెస్ట్ చేయించాల్సి ఉంటే ఆ డాక్టర్ ఆర్‌డిటి (రాపిడ్ డయగ్నోస్టిక్ టెస్ట్) కిట్ ద్వారా వ్యాధిని నిర్ధారించారు. ఈ వైద్యుని మోసాన్ని గుర్తించలేని రోగుల బంధువు(పేద)లు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని అమ్మేసి పిల్లలకు వైద్యం చేయిస్తున్నారు. అలానే కొందరైతే అప్పులు చేసి తీసుకువచ్చి తమ పిల్లలకు చికిత్స చేయిస్తున్నారు. బంధువుల బలహీనతలతో వ్యాపారం చేసుకునే ఇటువంటి ప్రభుత్వవైద్యులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీరి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా అసమర్ధ యంత్రాంగం ఏమీ చేయలేకపోతోంది. పిల్లల వైద్యుడితో పాటు ఇక్కడ కిడ్నీ, హార్ట్, నేత్ర, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు కూడా ప్రైవేటు సేవలు పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.