మళ్ళీ వీధివీధినా బెల్ట్ షాపులు
posted on Oct 17, 2012 @ 9:59AM
రాష్ట్రప్రభుత్వం కొత్త ఎక్సయిజ్ విధానం కింద లాటరీలో మద్యం దుకాణం పొందేందుకు ఎవరూ ముందుకురాకపోవటంతో వదిలేస్తే అక్కడ బెల్టుషాపు వ్యాపారం జోరుమీదుంది. పైగా ఎక్సయిజ్ సిబ్బంది ఆ పరిసరాలకే పోవటం లేదు. అంటే ఆమ్యామ్యాల బాపతు అన్నమాట. రాష్ట్రంలోని కీలకమైన నగర శివార్లలో మద్యం దుకాణాలకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఎక్సయిజ్ శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ(ఎపిబిపిఎల్) దుకాణాలను నెలకొల్పింది. కొన్ని షాపుల ప్రతిపాదనలే రద్దు చేసుకుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మద్యం దుకాణ ప్రతిపాదన విరమించుకుంటే సరిహద్దుల్లోని రెండు గ్రామాల దుకాణదారులు ఒక ఒప్పందానికి వచ్చి బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోసారి ఒక బెల్టుషాపునే రెండు దుకాణాల వారూ నిర్వహిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి, అప్పనపల్లి గ్రామాల మధ్య ఉన్న పెదపట్నంలంక. ఈ గ్రామంలో బెల్టుషాపు ప్రతిపాదన ఎక్సయిజ్ విరమించుకుంటే ఇక్కడ బెల్టుషాపు జోరుగా వ్యాపారం చేస్తోంది. ఇక లూజు విక్రయాల్లో ఈ బెల్టుషాపు తరువాతే ఏ దుకాణమైనా అని చెప్పాలి. అమలాపురం డివిజన్‌లో ఇంత బహిరంగంగా వ్యాపారం చేస్తున్నా ఎక్సయిజ్ ఎందుకు స్పందించటం లేదు? అధికారులకు మట్టేశాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టరు నీతూ కుమారి ప్రసాద్‌కు దీనిపై ఫిర్యాదు చేయాలని పెదపట్నంలంక గ్రామీణులు సిద్ధం అయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఇప్పటికే బెల్టుషాపుల వ్యాపారంలో అగ్రస్థానంలో ఉన్నాయని సమాచారం అందుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల్లో లూజ్ విక్రయాలు నెంబర్`1లా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమవ్యాపారానికి తెరలేచింది. చర్యలు మాత్రం ఎక్కడా తీసుకోవటం లేదు.