పాపం ఓ పోలీస్ ఆఫీసర్! పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు!
posted on May 30, 2024 @ 5:51PM
శుక్రవారం... అదే రేపు ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ఈ రోజు అంటే ఒక రోజు ముందు క్యాట్ ఉత్తర్వుల్ని సమర్దించింది హైకోర్టు. ఏబీవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేసి తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని, క్యాట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, ఈ రోజు తీర్పు ఇచ్చింది.
జనరల్‌గా మనం చూస్తూ వుంటాం అమాయక దళితుల్ని నక్సలైట్లు అని, అమాయక ముస్లింలను టెర్రరిస్టులని ముద్ర వేసి ఐదు, పదేళ్ళు నరకం చూపించిన తరువాత వారిది తప్పేమీ లేదని విడిచిపెడుతుంటారు. సేమ్ టూ సేమ్ అదే పద్దతిలో ఇక్కడ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని రాజ్యం టార్గెట్ చేసింది. రాజ్యం టార్గెట్ చేస్తే సాధారణ ప్రజలైనా, ఉన్నతాధికారులైన బలి కావాల్సిందేనని ఎబీ వెంకటేశ్వరరావు వ్యవహారం అద్దం పడుతోంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వచ్చిన కష్టం పగవాడికి కూడా రావద్దంటూ ఏపీలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండేళ్లకుపైగా సస్పెన్షన్ కు గురైయ్యారు. ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
అయితే ఇంతలోనే ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జూన్ 28న ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 7తో ఆయన సస్పెన్షన్ ముగిసిందని పేర్కొంది. రెండేళ్లకు మించి అఖిల భారత సర్వీసు అధికారులను సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు చెప్పింది. అయితే.. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
సుప్రీంకోర్టు తనపై సస్పెన్షన్ ఎత్తేయడంతో ఆ ఉత్తర్వుల కాపీతో ఏబీ.. సీఎస్ సమీర్ శర్మను కలిశారు. తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలాగే తనకు ఆపేసిన జీతభత్యాలను కూడా చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా నియమించింది.
అయితే.. ఆయనను మళ్లీ విధుల్లోకి చేరి కొద్ది రోజులు కూడా గడవకముందే, తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన యత్నిస్తున్నారని మరోసారి ఆయనపై వేటేసింది జగన్ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా చక్రం తిప్పిన ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేశారని.. వాటిని ఉపయోగించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం అనే కంపెనికి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న ఏబీ వెంకటేశ్వరరావు రూ.35లక్షలు చెల్లించారని చెబుతోంది. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్పత్తులను భారత్‌లో తీసుకురావడానికి యత్నించారని తీవ్ర అభియోగాలు ఆయనపై మోపింది.
ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారని జగన్ ప్రభుత్వం చెప్పింది. క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ విధించవచ్చని పేర్కొంటూ ఆయనను జూన్ 28న మరోసారి సస్పెండ్ చేసింది.
అలా... జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావు పగబట్టింది. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేసింది. ఆ ఆరోపణలను తేల్చలేకపోయింది. ఆయనను డిస్మిస్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన సర్వీస్ మొత్తం జీతం ఇవ్వాలని .. తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ రకరకాల సాకులు చెబుతూ… జగన్ ప్రభుత్వ వేధించింది.
ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ )ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది. ఎట్టకేలకు ఇవాళ ఆ తీర్పును ప్రకటించింది. ఇందులో క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు సమర్దించింది.
హైకోర్టులో పిటిషన్ వేశామన్న కారణంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం సీఎస్ తప్పిదమే అవుతుంది. ఈ విషయంలోనూ సీఎస్ జవహర్ రెడ్డి గీత దాటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
- ఎం.కె. ఫజల్