జగన్, జవహర్‌రెడ్డి మధ్య ఏబీవీ చిచ్చు?
posted on May 30, 2024 @ 5:49PM
త్వరలో మాజీ కాబోయే ముఖ్యమంత్రి జగన్, త్వరలో మాజీ కాబోతున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మధ్య స్నేహం ఇప్పటి వరకూ మూడు అధికార దుర్వినియోగాలు, ఆరు ఆశ్రిత పక్షపాతాలుగా సాగింది. ఇంతకాలం జగన్ ఆడమన్నట్టల్లా ఆడిన జవహర్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తన పాత విశ్వాసాన్ని మరచిపోకుండా జగన్ సేవలో తరిస్తూ వచ్చారు. ప్రతిపక్షాల మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకుని, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి తీరాల్సిందే అన్నట్టుగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్‌కి, జవహర్‌రెడ్డికి ఎంత ఫెవీకాల్ లాంటి స్నేహమైనా, జూన్ నాలుగో తారీఖు వరకే. ఇప్పటి వరకూ సాఫీగా సాగిన, ఇద్దరి పదవులు ఊడిపోయిన తర్వాత ఒకరి అవసరం మరొకరికి వుంటే కొనసాగే ఇద్దరి స్నేహంలో ఒక చిచ్చు వచ్చి పడింది. ఆ చిచ్చు పేరే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఆదేశించింది. తాజాగా హైకోర్టు కూడా ఆదేశించింది. రేపు ఒక్క రోజుతో ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ కెరీర్ ముగుస్తుంది. ఆయనకు పోస్టింగ్ రావడం అంటూ జరిగితే రేపు ఒక్క రోజులోనే జరగాలి. లేకపోతే ఆయన యూనీఫామ్‌లో రిటైర్ అవ్వరు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్.ని తీసుకుని ఏబీ వెంకటేశ్వరరావు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని గురవారం నాడు కలిశారు. ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి మీద వుంది. జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇస్తే, ఏబీ వెంకటేశ్వరరావు రేపు ఒక్కరోజు డ్యూటీ చేసి, యూనీఫామ్‌లో రిటైర్ అవుతారు.
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి జగన్‌తో ఏవో లావాదేవీలు వున్నాయి. అందుకే రాజకీయంగా ఆయనకు సహకరిస్తున్నారు. కానీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో ఎలాంటి విభేదాలూ లేదు. ఆయన కూడా డీజీపీ అయ్యే స్థాయి వున్న ఐపీఎస్ అధికారే. జగన్ అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశాడు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవ్వలేదుగానీ.. లేకపోతే ఏనాడో ఆయన ఆ పోస్టులో కూర్చునేవారే. అంత సీనియర్ అధికారి యూనీఫామ్‌లో రిటైర్ అయ్యేలా చేయడం కనీస ధర్మం అని జవహర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఒక్కరోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని జవహర్ రెడ్డి భావిస్తుంటే, లండన్ నుంచి జగన్ ఇవ్వడానికి వీల్లేదని ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే జవహర్ రెడ్డి మాత్రం ఏబీవీకి పోస్టు ఇచ్చే విషయంలో జగన్‌ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగన్ మాత్రం ఠాఠ్ వీల్లేదని అంటున్నట్టు తెలుస్తోంది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకపోతే అది ఆ తర్వాత జవహర్ రెడ్డి పీకకి చుట్టుకునే ప్రమాదం వుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది జవహర్ రెడ్డే. నిజానికి ఆయన ఈ విషయంలో జగన్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. అయిప్పటికీ జగన్ హర్ట్ అవకుండా తన బాధ్యతని నెరవేర్చడానికి జవహర్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం వీల్లేదంటే వీల్లేదని అంటున్నట్టు సమాచారం. జగన్ లండన్ నుంచి శుక్రవారం నాడు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇష్యూని ఇంకా లాగే ఉద్దేశంతో జగన్, ‘‘నేను వచ్చాక మాట్లాడదాం’’ అని జవహర్‌రెడ్డితో అన్నట్టు సమాచారం. మరి ఆయన వచ్చి, ప్రయాణ బడలిక తీర్చుకుని, కాలయాపన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ, జగన్ ఒప్పుకోకపోయినప్పటికీ రేపు ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంలోనే జవహర్ రెడ్డి వున్నట్టు సమాచారం. దీని కోసం జగన్‌తో బంధం కటీఫ్ అయిపోయినా పర్లేదనే నిర్ణయానికి జవహర్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి, ఏదైనా బలమైన అవాంతరం వస్తే తప్ప, ఏబీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు పోస్టింగ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.