బాబు ప్రసంగంలో పెరుగుతున్న పదును?
posted on Oct 31, 2012 @ 12:19PM
మీ కోసం వస్తున్నా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు మాటల్లో పదును రోజురోజుకు పెరుగుతోంది. మొదటి కిలోమీటరు పూర్తి చేసినప్పుడు చేసిన ప్రసంగానికి ఆ తరువాత చేస్తున్న ప్రసంగానికి ఎంతో వ్యత్యాసం ఉంది. పాదయాత్రలో తాను తెలుసుకున్న పలుఅంశాలను ప్రజల ముందే పెట్టి తనకు అధికారం వస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కరిస్తానని ఆయన ప్రత్యేకించి నొక్కి చెప్పటం రాజకీయవిశ్లేషణలో అనుభవాన్ని చాటుతోందని పరిశీలకులు కొనియాడేందుకు కారణమవుతోంది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించుకున్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తన ఐదువందల కిలోమీటర్ల పాదయాత్రలో గట్టిగానే ప్రజల ముందుకు తీసుకువచ్చారు. సందర్శకులతోనూ, ప్రజలతోనూ మమేకమైన బాబు తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవ చేస్తానని ఘాటుగా విమర్శకులకు సమాధానం ఇచ్చారు. రైతులకు తొమ్మిది గంటల పాటు విద్యుత్తు, సిఎం కుర్చీ ఎక్కగానే రైతుల బ్యాంకు రుణాల మాఫీ ఫైలుపై తొలిసంతకం చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకూ ఏమంత స్పందన ఉంటుందని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ కూడా బాబు ప్రసంగాలకు ఉలిక్కిపడుతోంది. మహిళల ఇబ్బందులు కనుక్కుంటూనే వారికి మద్యం బెల్టు షాపు ఒక్కటీ కనపడకుండా చేస్తానని హామీ ఇచ్చారు. బడుగులకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.