వైకాపాను నీట ముంచే బాధ్యత కోట్లదేనా?
posted on Oct 31, 2012 @ 12:17PM
మాట్లాడితే చాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫలానా ఎమ్మెల్యే రెడ్డి చేరారట కదా అని వచ్చే ప్రశ్నలతో కాంగ్రెస్ విసిగిపోయింది. అందుకే ఆ పార్టీ పుట్ట ముంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు కారణమైన రెడ్డి సామాజికవర్గంపై దృష్టి సారించింది. ఆత్మీయ సదస్సులు, పదవుల ఆశలు, ఇంకేరకమైన మంతనాలు చేసినా పర్వాలేదంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సూర్యప్రకాశరెడ్డి చేయాల్సిన పని ఒక్కటే వైకాపాను తుడిచేయటం అని తేల్చేసింది. అధిష్టానం ఇచ్చిన అవకాశంలో స్వేచ్ఛ కూడా కలిసి రావటంతో కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఇప్పటి వరకూ వైకాపాలో చేరిన రెడ్డి సామాజికవర్గ నేతలపై దృష్టి సారించారు. ప్రత్యేకించి వారితో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా వైకాపా అధినేత వైఎస్ జగన్ రెడ్డిసామాజిక వర్గానికి చెందరని, ఆయన వెనుకుంటే తప్పుడు పనులు చేసే సామాజికవర్గంగా రెడ్డికులాన్ని పరిగణిస్తారని సూర్యప్రకాశరెడ్డి స్పష్టం చేయనున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే మంచి పదవులు కూడా అందించగలమని, ఎప్పటి నుంచో రెడ్డి కులస్తులకే సిఎం కుర్చీ అప్పగించిన కాంగ్రెస్ సేవలను మరువరాదని ఆయన హితవు పలకనున్నారు. ఇలా జగన్‌ను అన్నిరకాల నష్టపరిచేందుకు పావులు కదుపుతున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి రాయలసీమలో ఆదరణ కూడా ఎక్కువే కావటం గమనార్హం. మంచి కుటుంబంగా ఉన్న పేరును ఉపయోగించుకుని ఆయన ఆత్మీయభేటీలకు శ్రీకారం చుట్టనున్నారు.