ఇక ప్రజాభిప్రాయంపైనే 2014 కాంగ్రెస్ టిక్కెట్లు...రంగంలోకి దిగిన రాహుల్‌సేన?
posted on Oct 31, 2012 @ 12:21PM
ప్రజల్లో నమ్మకం ఉన్న నేతలకే కాంగ్రెస్ పార్టీ 2014 ఎమ్మెల్యే, ఎంపి టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఇది కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. దీని కోసం 50మందితో ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు. ఈ టీము ముందస్తుగా ప్రతీ నియోజకవర్గంలోనూ పర్యటించి పరిశీలించి ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. దీన్ని బట్టి అభ్యర్థులు ఎవరో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే లిస్టు చేసుకుంటుంది. ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తయినా ఎన్నికలు వచ్చేంత వరకూ ఎవరికి టిక్కెట్లు ఇవ్వనున్నారో రహస్యంగానే ఉంచేందుకు టీముకు రాహుల్ సూచనలు ఇచ్చారు. ముందుగా కేంద్రంలో అధికారం సుస్థిరం చేసుకునేందుకు రాహుల్ పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నారు. ఆ తరువాత రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకూ ఇదే తరహా ఎంపిక జరగనుంది. బలమైన అభ్యర్థి అయితేనే టిక్కెట్టు ఇవ్వాలని లేకపోతే వారిని వదుల్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలని రాహుల్ భావిస్తున్నారు. స్థానికంగా ఉండే కులసమీకరణలు, రాజకీయ విశ్లేషణలు కూడా ఈ 50మంది పూర్తి చేసి ఆ తరువాత అభ్యర్థుల వివరాలను పార్టీతో ప్రకటింపజేసేలా రాహుల్ ఏర్పాట్లు చేశారు. బెంగుళూరులో తాజాగా సమావేశమైన ఈ సేనలో రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, కె.యాదవరెడ్డి, కందుల లక్ష్మీ దుర్గేశ్, భానుప్రసాద్, రాష్ట్ర మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు కె.గంగాభవానీ ఎంపికయ్యారు.