పురంధేశ్వరి, లగడపాటి ఇళ్ళ ముట్టడి
posted on Jul 29, 2013 @ 3:58PM
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ సోమవారం కేంద్రమంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించింది. వివిధ జిల్లాల్లో ఉన్న కేంద్రమంత్రులు పురంధరీశ్వరి, కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి.. ఎంపీలు సబ్బం హరి, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, చింతా మోహన్, బొత్స ఝాన్సీ, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల ఇళ్లను జేఏసీ నాయకులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరంతా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
లగడపాటి ఇంటి ముందు ఐకాస నేతలు టెంట్లు వేశారు. ఏపీఎన్జీవోలు లగడపాటి ఇంటిపైకి ఎక్కారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పురంధరీశ్వరి ఇంటి వద్ద కూడా ఆందోళనకర వాతావరణం నెలకొంది.