లక్ష కోట్ల ఆస్తి జగన్ లక్ష్యం: కొండా సురేఖ
posted on Jul 29, 2013 @ 2:20PM
రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్రకు చెందిన వైకాపా శాసనసభ్యుల రాజీనామాలతో ఆ పార్టీలో సంక్షోభం మొదలయింది. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ, మురళి, మహేందర్ రెడ్డి తదితరులు విజయమ్మతో రెండు సార్లు భేటీ అయినప్పటికీ పార్టీ రాష్ట్ర విభజనపట్ల తన ధోరణి మార్చుకొనేందుకు ఇష్టపడక పోవడంతో వారు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొండా సురేఖ విజయమ్మను, జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ వ్రాసారు.
క్లుప్తంగా లేఖలో సారాంశం: మేము స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైకాపాలో చేరిన సంగతి మీకు తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ‘మాట తప్పకు, మడమ తిప్పకు,’ అనే సిద్ధాంతం పాటిస్తే, ఇప్పుడు మీరు ఇద్దరూ కూడా తద్విరుద్ధంగా ‘మాట తప్పుతాము, మడమ తిప్పుతాము’ అనే కొత్త సిద్ధాంతం అవలంభిస్తున్నారు. తెలంగాణాపై పార్టీ ఇచ్చిన మాటను మరిచి ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్ర నేతలు రాజీనామాలు చేయడం కేవలం సీమంధ్ర ప్రాంతంలో వీలయినన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికే కదా?
ఇప్పుడు వైకాపా తన పూర్తి నిజస్వరూపాన్నిబయటపెట్టుకొని తమది పక్కా సమక్యవాద పార్టీ అని ఋజువు చేసుకొంది. మీ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడం కోసం రేయింబవళ్ళు కృషిచేసిన మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈవిధంగా చేసి మమ్మల్ని మీరిద్దరూ కూడా చాలా అవమానించారు. కొద్ది నెలల క్రితం జరిగిన యంయల్సీ ఎన్నికలలో సీట్లను రూ.7కోట్లకు అమ్ముకోవడం చూస్తే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం లక్ష కోట్ల రూపాయలు సంపాదించడమేనని స్పష్టం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉంటూనే పార్టీని తప్పుడు మార్గంలో నడిపిస్తూ పార్టీని సర్వ విధాల భ్రష్టు పట్టిస్తున్నారు.”