బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డిఎస్సీ అభ్యర్థులు 

సీఎం వైయస్ జగన్.. నిరుద్యోగుల విషయంలో మాత్రం మొదటి నుంచి శీతకన్ను వేశారన్నది నిజం. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా.. అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దాంతో జగన్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ముంగిట వారిని సంతృప్తి పరిచే దిశగా జగన్ అడుగులు వేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంకేతాలిచ్చారు.
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ఆ డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామని.. అలానే యూనివర్సిటీలు, ట్రిఫుల్ ఐటీల్లో కలిపి సుమారు 3,238 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. కానీ ఆచరణలో ఆమడ దూరంలో ఉన్నారు. దీంతో ఎపిలో నిరుద్యోగులు మండిపడుతున్నారు. 
మెగా డిఎస్సీ ప్రకటించాలని  డిమాండ్ చేస్తూ డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో డిఎస్ సి అభ్యర్థులు బుధవారం విజయవాడలోని మంత్రి  బొత్స సత్యనారాయణ  క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో  ముట్టడించారు.  వందలాది నిరుద్యోగులు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ప్రకటించకపోతే వైకాపా  ప్రభుత్వానికి  ప్రజలు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు కెసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన విధంగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నారు. మెగా డిఎస్ సితో బాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో  వచ్చినప్పటి నుంచి జాబ్ కేలండర్ ప్రకటించలేదనే ఆరోపణ మూఠగట్టుకున్నారు. 

Teluguone gnews banner