షర్మిల కోడలు బ్యాక్ గ్రౌండ్ గురించి అసలు నిజాలివే!
posted on Jan 3, 2024 @ 3:21PM
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయకు వెళ్లి ప్రత్యేక పార్ధనలు నిర్వహించారు. కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, కొంత మంది బంధువులు కూడా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని, వైఎస్సార్‌తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ఆయన కాబోయే భార్య ప్రియా అట్లూరి జంటకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు ఇంతకీ రాజారెడ్డి చేసుకోబోయే ప్రియా అట్లూరి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రాజారెడ్డి-ప్రియా అట్లూరి పరిచయం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రియా ఎవరనేదానిపై చాలా రకాల ఊహాగానాలు కూడా ఇప్పటికే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రియా ఎవరన్నది ఆసక్తిగా మారింది.
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు. అయితే, ఈ ప్రేమికులిద్దరూ తమతమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇక, ప్రియా అట్లూరి చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా కాగా.. అట్లూరి శ్రీనివాస్‌కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలుకూడా ప్రియా తండ్రే చూస్తున్నారని చెప్తున్నారు. కాగా అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రియా కుటుంబం ఎప్పుడో క్రైస్తవ మతాన్ని స్వీకరించారని కూడా తెలుస్తోంది. మొత్తంగా అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని చెప్తున్నారు.
జనవరి 18న వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియాల నిశ్చితార్థం వేడుక జరగనుండగా.. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనుందని తాజాగా స్వయంగా షర్మిలనే ప్రకటించారు. రాజారెడ్డి, ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లు సమాచారం ఉండగా.. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక, అంతకు ముందే హైదరాబాద్ లో నిశ్చితార్థం వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్తున్నారు. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట. ఇప్పటికే బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఇన్విటేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంగళవారం (జనవరి 2న) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకొని పూజలు నిర్వహించారు.
ఇక, ఇడుపుల పాయలో మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ విలీనం ప్రక్రియ పూర్తి కానున్నట్లు, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించనున్నట్లు షర్మిల వెల్లడించేశారు. దీంతో హైదరాబాద్ లో జరగనున్న నిశ్చతార్థం వేడుకపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది. షర్మిల ఇంట పెళ్లి భజంత్రీలతో పాటు ఈ జనవరి నెలలలోనే షర్మిల రాజకీయ జీవితంలో కూడా కీలక మలుపులు తిరగనున్నట్లు కనిపిస్తుంది. షర్మిల ఏపీకి రానుండడం, స్వయంగా అన్న జగన్ మీదనే తలపడనుండడంతో.. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఇక షర్మిల తాడేపల్లికి వెళ్లి స్వయంగా బుధవారం అన్న జగన్ ను కలిసి కుమారుడు పెళ్లికి ఆహ్వానం పలికారు. కాగా ఈ సందర్భంగా అన్నా చెళ్లెళ్ల మధ్య ఏం జరిగిందీ, షర్మిల కాంగ్రెస్ గూటికి చేరనుండటంపై జగన్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా? షర్మిల ఏం మాట్లాడారు? వంటి అంశాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుని పొరుగురాష్ట్రం వెళ్లిన తరువాత ఇరువురూ కలిసిన సందర్భం ఇదే కావడం గమనార్హం. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఏపీ రాజకీయాలలో క్రీయాశీలం కావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుందన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.