తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. మరి కొద్ది సేపటిలో పోలింగ్
posted on Dec 13, 2025 @ 12:34AM
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. . ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలౌతుంది. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు.
ఏకగ్రీవాలు కాకుండా.. మిగిలిన 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కాగా తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల హవా సాగింది. మొత్తం 3834 సంర్పంచ్ స్థానాలకు, 27 వేల 628 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక 398 పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ జరిగిన పంచాయతీల్లో 37 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 3451 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేశారు. మొత్తం 52, 57 277 మంది ఓటర్లకుగాను 45, 15, 141 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 84.28శాతం ఓటింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 92. 88 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థలు ఉండగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా విజయం సాధించిన వారిలో ఉన్నారు.