రాజధాని అంశం బెడిసికొట్టేలానే ఉంది.. వైసీపీ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది!!
posted on Dec 31, 2019 @ 11:56AM
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తుండడంపై అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన ఉద్యమం రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు కూడా పాకింది. రైతుల ఆందోళనను తొలుత లైట్ గా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత సెగ తగులుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగం గానే పరిపాలన ఒకే చోట ఉండాలని శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ ఒక చోట ఉంటేనే నిర్ణయాలు వెంటనే తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అలా చేసిన మరుసటి రోజే అగ్రనేతలు ఒత్తిడితో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్లీనంగా ఉన్న భావన ఏమిటో తెలిసిపోయింది.
అమరావతి ప్రాంత గ్రామాల్లో విస్తరించిన నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందేనని భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రాజకీయ సెగ ఎక్కువైంది. తమ నియోజక వర్గాల ఎమ్మెల్యేల వద్దకు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే వెళ్లి ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సదరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి వర్గ సమావేశానికి ముందు రోజు సీఎం జగన్ నివాసంలో ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో నిరసనలూ ఆందోళనలూ పెరిగాయని తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తేల్చి చెప్పేశారు. రాజధాని రైతుల ఆందోళనలు.. అక్కడి మహిళల కన్నీరు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గాల్లో సామాన్య ప్రజానీకం కూడా రాజధాని అమరావతిని తరలించడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారని వివరించారు. శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించగా అసెంబ్లీ సమావేశాలు కూడా కేవలం శీతాకాలానికే పరిమితం చేయడం గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్టు తెలిసింది. దీనివల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టమేనని రాజధానిని తరలించుకుపోతున్నారనే ఆవేదన ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. కోస్తాంధ్ర ప్రజలు రోడ్డు మీదకు రారని.. సమయం చూసి వాతపెడతారని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఓ ప్రముఖుడు మాత్రం చంద్రబాబు రాజధానిని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తే ఆ రాజధాని ఏర్పాటైన తాడికొండ, మంగళగిరి నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ ప్రముఖుడు ఎమ్మెల్యేలకు హితవు చెప్పారు. అయితే రాజధానిపై ఈ వాదన తెస్తున్న ఆ ప్రముఖుడి అభిప్రాయాలు బయటకొచ్చాక ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేస్తే, విశాఖలో పాలన రాజధానిని ఏర్పాటు చేస్తే రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయనే నమ్మకం ఉందా అని నిలదీశారు.
మొత్తం మీద ఇలాంటి వాద ప్రతివాదనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను లోలోపల కలవర పరుస్తున్నాయని తెలుస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయాలని.. వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతనే రాజధాని తరలింపు పై ఓ నిర్ణయానికి వస్తే బావుంటుందని కూడా వారు సూచించినట్టు సమాచారం. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతానని సదరు ప్రముఖుడు కూడా హామీ ఇచ్చారు. కాని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేల ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించలేదు. బయటకేమో తామంతా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. కానీ లోపల జరిగిన తంతు నిదానంగా బయటకు పొక్కడంతో తమ నియోజక వర్గాల ప్రజలకు సదరు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.