ఇకపై హైదరాబాద్ లో ఈ చలాన్ వడ్డింపులు
posted on Oct 10, 2012 @ 4:26PM
ఇప్పటివరకూ ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించే మోటారిస్టుల్ని పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలుపడుతున్నారు. అడ్వాన్స్ డ్ కెమెరాలున్న కూడళ్లలో సిగ్నల్ జంప్ చేసిన వాళ్లని ఫోటోలు తీయడం చాలా సులభం. లేని చోట్ల కానిస్టేబుళ్లు, హోం గార్డులు కెమెరాలు చేత్తోపట్టుకుని నానా తంటాలుపడుతుంటారు. పైగా చలాన్లు పంపించేందుకు ఈ ఫోటోలు రుజువులుగా ఉపయోగపడతాయ్ కూడా.. పోలీస్ శాఖలో లంచగొండి తనాన్ని నివారించేందుకు ఫోటోలు తీసి చలాన్లను నేరుగా ఇంటికి పంపించే పద్ధతిని కొంతకాలంగా అమలుచేస్తున్నారు. ఇకపై ఈ విధానానికి మరింత మెరుగులు దిద్ది అడ్వాన్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నారు. రోడ్లపై ఏర్పాటుచేసే అడ్వాన్స్ టెక్నాలజీ డిజిటర్ కెమెరాల సాయంతో రూల్స్ ని అతిక్రమించేవాళ్ల ఫోటోలు తీయడం చాలా తేలికైపోతుందని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఆనంద్ చెబుతున్నారు. ఇలా తీసిన ఫోటోల్ని చలాన్లతోపాటుగా నేరుగా అడ్రస్ కే పంపించబోతున్నారు. దీనివల్ల రూల్స్ ని అతిక్రమించిన మోటారిస్టులు మేం తప్పుచేయలేదని బుకాయించడానికి అవకాశమే లేకుండా పోతుందన్నది పోలీస్ బాస్ ల అంచనా.