పాదయాత్రలో కాంగ్రెస్ పై నిప్పులు కురిపిస్తున్న బాబు
posted on Oct 10, 2012 @ 4:32PM
చంద్రబాబు పాదయాత్రకు జనంలో విపరీతమైన స్పందన కనిపిస్తోంది. అరవైఏళ్ల వయసులో బాబు ఎలా దూసుకుపోతున్నారో చూసేందుకు జనం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు చిన్నా చితకా యాత్రలు చేసినప్పటికీ ఈసారి చాలా పెద్ద పాదయాత్రని చేపట్టడంతో జనంలో క్యూరియాసిటీ బాగా పెరిగిపోతోంది. బాబు ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదే అదనుగా భావించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతల్ని ఉతికారేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీయే మొత్తం స్కాముల పార్టీ అంటూ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి ఎనిమిదోరోజు పాదయాత్రని ప్రారంభించిన చంద్రబాబు విరూపాపల్లిలో రాత్రిబస చేశారు. దారిపొడవునా పాదయాత్రలో చంద్రబాబు కాంగ్రెస్ పై నిప్పులు చెరగడమే పనిగాపెట్టుకున్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రానికి నాలెడ్జ్ హబ్ అనే పేరొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో అది స్కాముల హబ్ గా మారిపోయిందని తీవ్రస్థాయిలో బాబు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మేల్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే కాంగ్రెస్ పార్టీకి పిల్లకాంగ్రెస్ పార్టీకూడా తోడై రాష్ట్రాన్ని పూర్తిగా దోచేస్తారంటూ చంద్రబాబు కాంగ్రెస్, వైఎస్సాఆర్ సీపీ లపై ఆరోపణాస్త్రాల్ని సంధిస్తున్నారు.