ఎర్రచందనం జోలికి వెళ్తే తాట తీస్తాం.... పవన్ వార్నింగ్
posted on Nov 8, 2025 @ 6:19PM
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారి తాట తీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం చెట్లను వెంకటేశ్వర స్వామి తన రక్తంతో సృష్టించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎర్ర చందనం చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్ తో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
వైసీపీ హయంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని వెల్లడించారు. ఆన్ రికార్డు ప్రకారం లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను అడ్డగోలుగా నరికేశారని వీటి విలువ రూ. 2 నుంచి 5 వేల కోట్లు ఉంటుందని పవన్ తెలిపారు. అనధికారికంగా రూ.8 నుంచి 10 వేల కోట్ల స్మగ్లింగ్ జరిగిందని పేర్కొన్నారు.ఆపరేషన్ కగార్ లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకువస్తామని పవన్ అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న కింగ్ పిన్ లను త్వరలోనే పట్టుకుంటామని డిప్యూటీ సీఎం స్ఫష్టం చేశారు.
తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్‌ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎ, బి, సీ మరియు నాన్‌గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు తెలుసుకొని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం, ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్‌కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన నాటి నుండి విక్రయమయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.