డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతి.. న్యాయవాదుల దినోత్సవం నేడు..!
posted on Dec 3, 2025 @ 9:30AM
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు. ప్రజలకు న్యాయాన్ని చేకూర్చడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న, భారతదేశంలోని న్యాయవాదుల సంఘం న్యాయవాదుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది . ఇది భారతదేశపు మొదటి రాష్ట్రపతి, భారతదేశ ప్రముఖ న్యాయవాది అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి గురించి తెలుసుకుంటే..
డాక్టర్ రాజేంద్రప్రసాద్..
రాజేంద్ర ప్రసాద్ డిసెంబర్ 3, 1884న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో, కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. మొదట్లో రాజేంద్రప్రసాద్ గారు సైన్స్ విద్యార్థి. 1907లో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి బోధన వృత్తిలో అడుగుపెట్టారు.
1909లో ప్రసాద్ న్యాయశాస్త్రం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. 1910లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పూర్తి చేసి, 1915లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని అందుకున్నాడు. మరుసటి సంవత్సరం రాజేంద్రప్రసాద్ గారు బీహార్- ఒడిశా హైకోర్టులో చేరారు. భాగల్పూర్ నగరంలో కూడా న్యాయవాద వృత్తిని చేపట్టారు.
న్యాయవాదిగా ఆయన కెరీర్ చాలా అద్బుతంగా ఉండేది, కానీ 1920లో స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయం చేయడానికి ఆయన పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు. 1937లో ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు.
1950లో రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చి విద్యాభివృద్ధికి దోహదపడినవారు రాజేంద్రప్రసాద్ గారే.. అందుకే ఆయన జయంతిని న్యాయవాదుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
*రూపశ్రీ.