మూడు రాజధానులపై ఒక్క అడుగు వెనక్కేసిన జగన్..!
posted on Dec 29, 2019 8:54AM
అమరావతిలో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కేసింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఉందంటూ ప్రచారం జరిగినా... రాజధాని రైతుల ఆందోళనలతో కొంచెం వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు అధికారికంగా ప్రకటిస్తే అమరావతి గ్రామాల్లో పరిస్థితి చేయి దాటుతుందన్న సమాచారంతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, అమరావతి రైతులు, ప్రజల ఆందోళనలను చల్లార్చడానికే హైపవర్ కమిటీ అంటూ వ్యూహం మార్చారనే మాట వినిపిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించినా.... ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అందాల్సి ఉందంటూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతేకాదు, ఈ రెండు నివేదికపై మరింత విస్తృత అధ్యయనం కోసం హైపవర్ కమిటీని అపాయింట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే, మూడు రాజధానులపై అధికారిక ప్రకటన ఆలస్యమైనట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే, బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చాకే... రెండు రిపోర్టులపైనా హైపవర్ కమిటీ విస్తృత అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, జనవరిలోనే బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది.
జీఎన్ రావు కమిటీ ఇవ్వకముందే, అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి బయటపెట్టడం.... ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాటలనే దాదాపు యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదికగా ఇవ్వడంతో విమర్శలు చెలరేగాయి. జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని... అందుకే జీఎన్ రావు కమిటీతో తాము అనుకున్నది చెప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే చెడ్డ పేరు రాకూడదనే... మరింత విస్తృత అధ్యయనం కోసం సీఎం జగన్ హైపవర్ కమిటీని అపాయింట్ చేశారని అంటున్నారు.