తమిళం తరహాలో తెలుగుభాషను గుర్తించరెందుకు?
posted on Oct 30, 2012 8:06AM
పొరుగున ఉన్న తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలు తెలుగులో ఎందుకు ముద్రించటం లేదు? భాష ప్రాముఖ్యతను ఎందుకు గుర్తించటం లేదు? ఈ రెండు ప్రశ్నలు మేధావులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. భాషపై తెలుగుప్రజలందరికీ మమకారం ఉన్నా అమలులో మాత్రం ఇంగ్లీషును ఉపయోగించటానికి ప్రతీ ఒక్కరూ అలవాటుపడిపోయారు. ప్రత్యేకించి పిల్లలను కూడా విశ్వజనీయంగా తీర్చిదిద్దాలని ప్రతీ తెలుగు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దీంతో ప్రైవేటు కాన్వెంటులు, కార్పొరేట్ సంస్థలు తెలుగులోనే బోధించే ప్రభుత్వ పాఠశాలల కన్నా ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి. తెలుగుభాషోపాధ్యాయుడు కూడా తమ పిల్లలు ఇంగ్లీషు మాట్లాడితే ఆనందిస్తున్నాడు. బయటికి వచ్చినప్పుడు మాత్రమే తెలుగుపై ప్రేమచూపిస్తున్నారు. పైగా, తెలుగుభాషలో పరభాషాపదాలు ఇట్టే చొచ్చుకుపోతున్నాయి. వాటిని ఆదరించి తెలుగుభాషలో మాట్లాడటానికి యువత సిగ్గుపడుతున్నారు. ఇటువంటి సమాజపోకడలకు నేతల వైఖరి కూడా తోడైంది. ప్రభుత్వం ప్రతీసారీ తమ ఆదేశాలు తెలుగులోనే వెలువరిస్తామంటూ భీషణప్రతిజ్ఞలు చేయటానికి అలవాటుపడిరది. ఆచరణలో మాత్రం దానిపై శ్రద్ధ చూపటం లేదు. ప్రత్యేకించి తమిళనాడులో ప్రభుత్వ ఆదేశాలు తమిళంలో ప్రచురించటానికి కారణం పరిశీలిస్తే యావత్తు నేతలందరూ కలిసికట్టుగా అమలు చేయటానికి కంకణబద్ధులయ్యారు. వీరితో పాటు ప్రభుత్వమూ ఆచరణకు నడుం కట్టింది. అంతేకాకుండా తమది ప్రాచీనభాష అని చాటుకునేందుకు ఆ ప్రభుత్వం పలురకాల శాసనాలను ప్రచారం చేసింది. ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే తాజాగా అధికారభాషాసంఘానికి తోడు లభించినట్లే. లేకపోతే తెలుగుభాష తన పటుత్వాన్ని, గుర్తింపును కోల్పోతుందని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మార్పు వస్తేనే ఇది సాధ్యమని కూడా పరిశీలకులు తేలుస్తున్నారు.