షర్మిలపై కాలుదువ్వుతున్న అనురాధ? టిడిపి కొత్త ఎన్నికల అస్త్రం?
posted on Oct 30, 2012 8:08AM
తెలుగుదేశం పార్టీ తమ తరుపున కొత్తగా నేతలను రంగంలోకి దించేందుకు కసరత్తులు చేస్తోంది. దానిలో భాగంగానే కొందరు నేతలను విమర్శనాస్త్రాలతో మాటలను పదును పెట్టుకోమని (2014ఎన్నికల కోసం) ఆ పార్టీ వారిని పరిశీలిస్తోంది. పైగా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలను ఎదిరించటం అలవాటుపడే మహిళానేతలకు పెద్దపీట వేసేందుకు సైతం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ పెద్దగా స్పందించని ఆ పార్టీ మహిళానేతలు తమ అధినేత పాదయాత్ర సందర్భంగా తమ ఘాటైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఓ అస్త్రం వెలుగులోకి వచ్చింది. ఆమే తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి పంచుమర్తి అనురాధ. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిలతో తలపడేందుకు తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. పేదరైతుల భూములను దోచుకున్న ద్రోహి వైఎస్ అని ఆమె ఘాటుగా విమర్శిస్తూ తాను షర్మిలతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత షర్మిలకు లేదని ఆమె అన్నారు. జగన్ ఒక దొంగ అని సిబిఐ, ఈడీ ఎప్పుడో చెప్పారన్నారు. దొరసాని కథలు చెబుతూ పాదయాత్రలతో షర్మిల కాలం గడపటాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. వైఎస్ హయాంలో దాదాపు 15వేల మంది రైతులు చనిపోయారని ఆమె అంచనా వేశారు. తాను చేసిన ఆరోపణలపైనే కాకుండా షర్మిల చేసిన వ్యాఖ్యానాలపైనా తాను సమాధానం చెప్పగలనని, తనతో బహిరంగ చర్చకు షర్మిల సిద్దమా అని సవాల్ విసిరారు.