ఆదరణ’తో బాబుకు ప్రజాదరణ?
posted on Oct 30, 2012 8:03AM
తొమ్మిదేళ్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రపాలనలో అత్యంత కీలకమైన పథకం ఆదరణ. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేయటమే మానేసింది. అందువల్ల వృత్తులపై కాంగ్రెస్‌కు పెద్దగా పట్టు చిక్కలేదనే చెప్పాలి. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్రలో వృత్తిదారులు ఆ పథకాన్ని గుర్తు చేశారు. తమకు పనిముట్లు కొనుక్కోవాలంటే పెరిగిన కుటుంబభారం, ఖర్చులు ఆయన ముందుంచారు. అసలే తెలుగుదేశం పార్టీకి 2012 ఉపఎన్నికల్లో ఓటమికి వృత్తిదారుల సహకారం లేకపోవటమే కారణమని గుర్తించారు. అందువల్ల వృత్తిదారులకు ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు ఆదరణ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పటికే బిసి డిక్లరేషను ప్రకటించిన తొలిపార్టీగా ఉన్న తెలుగుదేశం వృత్తిదారులకు మరింత దగ్గరయ్యేందుకు అవకాశం లభించింది. తనతో పాటు పార్టీ శ్రేణులు కూడా వృత్తిదార్లకు పూర్తిస్థాయి సహకారమందిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా వృత్తిదార్లను ఆకట్టుకుంది. ఇప్పటిదాకా తమ తరుపున అధికారులను ప్రశ్నించేవారే కరువయ్యారని బాబును వృత్తిదారులు ఆదరిస్తున్నారు.