కేసిఆర్‌ను ఎవరు కలిసినా వార్తే?
posted on Oct 30, 2012 8:10AM
ఢల్లీలో సుదీర్ఘలాబీయింగ్ నడిపి తెలంగాణా సాధిస్తానని బీరాలు పలికిన టిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావును ఇప్పుడు ఎవరు కలిసినా పెద్ద వార్త అవుతోంది. ఎందుకంటే ఆయన ఢల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో పెద్దలాబీయింగ్ నడిపారని తెలంగాణావాదులు నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణాజెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను కేసిఆర్ లాబీయింగే హీరోను చేసిందని చెప్పుకోవాలి. ఈయన ఎవర్ని కలిసినా వార్త అయ్యే పరిస్థితి కేసిఆర్ చలువ వల్ల వచ్చినదే. తాజాగా పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణ తన కుమార్తె వివాహానికి కేసిఆర్‌ను ఆహ్వానించేందుకు కలిశారు. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు? నవంబర్ 2న జరిగే బొత్సా కుమార్తె వివాహానికి కేసిఆర్ వెడతారా? అదీ కుటుంబ సమేతంగా రమ్మనమని బొత్సా పలికిన ఆహ్వానం కేసిఆర్ ఉపయోగించుకుంటారా? బొత్సాకుమార్తె వివాహానికి కాంగ్రెస్ ఢల్లీ నేతలు కూడా వస్తారని భావిస్తున్నారు. వీరితో మాట్లాడేందుకు కూడా ఈ వివాహవేదిక ఉపయోగపడగలదని కేసిఆర్ సన్నిహితులంటున్నారు. అందువల్ల బొత్సా ఆహ్వానం ఉపయోగించుకుంటే ప్రత్యేకించి కొంతకాలం ఢల్లీ వెళ్లాల్సిన పని తప్పుతుందని కేసిఆర్‌కు సన్నిహితులు సూచిస్తున్నారట. ఈ సూచనను కేసిఆర్ పాటించే అవకాశమూ ఉంది. వ్యక్తిగతమైన ఆహ్వానాలు వార్తలుగా మలచటం వరకూ ఓకే. కానీ, ఇంత సీరియస్‌గా రాజకీయ చర్చకు తావిస్తోందంటే కేసిఆర్‌ను ఎవరు కలిసినా వార్తే అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు కూడా. కాంగ్రెస్ పార్టీలో వారైతే మరీ ప్రాముఖ్యత ఉన్న వార్తంటున్నారు. గతంలో బొత్సా ఒకసారి తెలంగాణాకు మద్దతుపలకటం, ఇప్పుడు కుమార్తె వివాహానికి ఆహ్వానించటం పరిశీలించతగ్గ అంశాలని నొక్కి చెబుతున్నారు.