రాజీనామాలకు సిద్ధమౌతున్న తెలంగాణ మంత్రులు
posted on Oct 1, 2012 @ 3:44PM
ప్రత్యేక తెలంగాణని సాధించుకునేందుకు తెలంగాణ మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా రాజుకున్న వేడి మంత్రుల్ని రాజీనామాలకు పురికొల్పుతోంది. ఇంత తతంగం జరుగుతున్నా మంత్రులు చూస్తూ ఊరుకున్నారన్న అపప్రథ రాకుండా ఉండాలంటే రాజీనామాలు చేయడమే మంచి మార్గమని తెలంగాణ జెఎసి నేతలు మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ సారి రాజీనామాలు చేస్తేమాత్రం ఇక వెనకడుగువేసేదిలేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రకటించారు. తెలంగాణ మార్చ్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించారని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయన్న ఆరోపణల్ని సమర్ధంగా ఎదుర్కునేందుకు అంతా కలిసికట్టుగా కృష్టి చేయాలని, అరాచక శక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని దామోదర రాజనర్సింహ జేఏసీ నేతలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మార్చ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న చాలామంది నేతల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉపముఖ్యమంత్రి డిజిపిని నిలదీశారు. అలాంటిదేంలేదని ఆయన కొట్టిపారేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన డెప్యూటీ సీఎం రాజీనామాల ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.