లగడపాటి దిష్టిబొమ్మ దహనం, ఉస్మానియాలో ఉద్రిక్తత
posted on Oct 1, 2012 @ 3:37PM
తెలంగాణ మార్చ్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మారోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఉస్మానియా యూనివర్సిటీని మూసేయాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు వర్సిటీ విద్యార్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెచ్చిపోయిన విద్యార్దులు ఉస్మానియా పోలీస్టేషన్ పై రాళ్లు రువ్వారు. లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మని తగలబెట్టారు. గుంపుని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. తెలంగాణ వేడి రాజుకున్నప్పుడల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తడం సర్వసాధారణంగా మారిపోయిందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ అదనపు బలగాల్ని వర్సిటీలో మోహరించి రెచ్చిపోతున్న విద్యార్ధుల్ని అదుపుచేయడానికి ప్రయత్నించడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. విద్యార్ధుల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు యూనివర్సిటీలో తిష్టవేశాయన్న ఆరోపణలుకూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్ నేపధ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంటుందని ముందుగానే ఊహించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి విద్యార్ధులు విధ్వంసానికి దిగకుండా అడ్డుకున్నామని పోలీసులు అంటున్నారు.