రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానానికి టి.కాంగ్ ఎంపీల కంప్లైంట్
posted on Oct 1, 2012 @ 3:51PM
తెలంగాణ మార్చ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ టి.కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని, 2014 ఎన్నికల్లో రాహుల్ ని ప్రథానిగా చూడడం కష్టమేనని హెచ్చరించాలని టి.కాంగ్ ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని విస్మరిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ అధిష్ఠానానికి చిక్కులు తప్పవనే సంకేతాల్ని పంపడమే ఈ ఫిర్యాదు పరోక్ష లక్ష్యమని కొందరు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీమీద ప్రజల్లో నమ్మకం పోయిందని, తిరిగి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తెలంగాణ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని టి.కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానానికి చెప్పబోతున్నారు. ఈసారి రాజీనామాలంటూ చేస్తే తెలంగాణ విషయంలో తాడోపేడో తేలేవరకూ వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు.