అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన
వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మదురో అరెస్టు వ్యవహారం వెనుక డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన కారణాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఆయనను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచింది. అయితే మదురో తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.
తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ, దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు. అమెరికా అక్రమంగా తనను పదవి నుంచి తొలగించినా, తానే ఇప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడినని ఆయన ఉద్ఘాటించారు. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా కోర్టులో హాజరు పరిచారు. ఆమె కూడా తాను వెనిజులా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని స్పష్టం చేశారు. అమెరికా మదురోపై నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో వాదించారు.
ఇలా ఉండగా మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీనిని పేర్కొన్నారు.
అదలా ఉంటే.. వెనిజువేలా అరెస్టు తరువాత ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా అక్కడి అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి. మదురోను అమె రికా బందీగా పట్టుకుని తరలించిన తరువాత ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. వెనిజువెలాలో సక్రమంగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని పేర్కొన్నారు. కాగా వెనిజువేలాలో పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందించింది. వెనిజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.