యుద్ధం అసాధ్యం.. అందుకే లొంగుబాటు!
posted on Jan 6, 2026 8:51AM
సాయుధ పోరాటం అసాధ్యమని మావోయిస్టు అగ్రనేత బట్సే దేవా అలియాస్ సుక్కు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల లొంగిపోయన సుక్క.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమైన తరువాత ఆయన స్కథానంలో మావోయిస్టు పార్టీ ఆయుధ దళాధిపతిగా నియమితుడయ్యాడు. బట్సే దేవా అలియాస్ సుక్క తనతో పాటు 19 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి 40 అధునాతన ఆయుధాలతో ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే.
మావోయిస్టు కేంద్ర కమిటీలో అంతర్గతంగా ఏం జరిగిందన్నది తనకు అంత స్పష్టంగా తెలియదన్న సుక్మ, మల్లోజుల లొంగుబాటు తరువాత పార్టీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు. సాయుధ పోరాటం వీడాలన్న చర్చ పార్టీలో జరిగిందా అన్న సందేహాలు కూడా తలెత్తాయనీ, అయితే కొన్ని రోజుల తర్వాత పరిస్థితిపై స్పష్టత వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని బట్సె దేవా అలియాస్ సుక్క వెల్లడించారు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాతనే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో లొంగిపోయినట్లు వివరించారు. తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాడుల సమయంలోనే దొరికినవేనని, ఆయుధాల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీ కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునేవారమని చెప్పిన సుక్మ.. హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధాలను కూడా తయారు చేశామన్నారు. మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.
హెడ్మా మరణం తర్వాత పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందనీ, హెడ్మా ఎన్ కౌంటర్ కు ముందే పార్టీ తనను పీఎల్‌జీఏ కమాండర్‌గా నియమించిందనీ, హెడ్మా ఉన్న సమయంలోనే తానా బాధ్యతలు నిర్వహించానని దేవా వెల్లడించారు. ఒకప్పుడు 400 మంది వరకు ఉన్న పీఎల్‌జీఏ కమాండర్లు ఇప్పుడు 60 మందికే పరిమితమయ్యారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లొంగిపోయిన తరువాత పునరావాసం కల్పించారని, భవిష్యత్ లో ఎటు వెళ్లాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేవా చెప్పారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ఎవరు పనిచేస్తున్నారన్న విషయమూ తనకు తెలియదని దేవా చెప్పారు.
బసవరాజు స్థానంలో దేవిజీ నియమితుడయ్యారన్న సమాచారమూ తనకు అందలేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు వెల్లడించలేనన్న సుక్మా మాట లతో మావోయిస్టు ఉద్యమం ప్రస్తుత స్థితిని, అంతర్గత బలహీనతలు స్పష్టంగా వెల్లడయ్యాయని రాజ కీయ, భద్రతాదళాలు భావి స్తున్నాయి.