మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ
ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్‌పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతు న్నట్టు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.
ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరా లకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు ప్రకటించింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, రియల్ ఎస్టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి.
గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రయత్నాలు కొనసాగడంతో తాజా ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.హైడ్రా అధికారులు తాజా విచారణలో, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్ 44లోని దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అక్రమ ఆక్రమణలపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.