ఆకు పచ్చని కోనసీమలో ఓఎన్జీసీ మంటల కొలిమి!
posted on Jan 6, 2026 @ 11:32AM
పచ్చటి కోనసీమను ఓఎన్జీసీ నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది. ఎన్జీసీ చమురు, సహజవాయువుల అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు కొనసీమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పచ్చగా కళకళలాడే కోనసీమ నిప్పుల కుంపటిలో భగభగలాడిపోతోంది. ఎక్కడ ఏ చిన్న గ్యాస్ లీకేజీ జరిగినా కోనసీమ వాసులు గుండెలు గుభేలు మంటున్నాయి. మంటలు ఎగసిపడి పచ్చటి పొలాలను మాడ్చేస్తాయా, కామధేనువు వంటి కొబ్బరి చెట్లను కాల్చేస్తాయా అన్న భయంతో వణికిపోతున్నాయి. తాజాగా మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీ బ్లోవుట్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు గుండెలరచేత పట్టుకుని క్షణమెక యుగంగా గడుపుతున్నారు. సంఘటనా స్థలానికి కిలో మీటర్ దూరంలో నివాసం ఉండే ప్రజలకు ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు. స్కూళ్లలో పిల్లలు భోజనాలు చేస్తుండగా.. వారిని మధ్యలోనే లేపేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేందుకు ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉండే ప్రజలందరినీ కేవలం ఐదంటే ఐదు నిముషాల వ్యవధిలో కట్టుబట్టలతో ఖాళీ చేయించి లక్కవరం పునరావాస కేంద్రానికి చేర్చారు.
దట్టమైన పొగ కారణంగా తమలో కొందరికి శ్వాసకోశ జబ్బులు, దగ్గు వంటివి వచ్చాయని.. కంటికి కనిపించని పొగ కారణంగా ఎవరు ఎటు పురుగుదీస్తున్నామో అర్ధం కాని దుస్థితి తలెత్తిందని వాపోతున్నారు వీరు. ఇదిలా ఉంటే గతంలో మీరెప్పుడైనా ఇలాంటిది చూశారా అంటే లేదంటున్నారు ఇరుసమండ గ్రామస్తులు. 200 గజాల దూరంలో ఈ ఘటన జరగడంతో ఏం చేయాలో పాలుపోక తలో దిక్కు పారిపోవల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా.
ఇదంతా ఇలా ఉంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో చూస్తే.. 1993లో రాజోలు మండలం, కడలి పరిధి తూర్పు పాలంలో కొమరాడ- 1 డ్రిల్లింగ్ సైట్ లో ఒక బ్లో అవుట్ ఘటన జరిగింది. ఈ స్పాట్ నుంచి ఎగబడ్డ చమురు స్థానిక కడలి డ్రెయిన్ లో కలిసి పలు చోట్ల మంటలు అంటుకోవడంతో పాటు.. వేల కొబ్బరి చెట్లు దగ్థమయ్యాయి. 26 రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ ద్వారా బావిని పర్మినెంట్ గా మూసెయ్యాల్సి వచ్చింది.
ఇక 1995లో పాశర్లపూడి ఘటన జరిగింది. పాశర్లపూడి- 19 బావిలో డ్రిల్లింగ్ టైంలో బ్లో అవుట్ సంభవించి 65 రోజుల పాటు అగ్నికీలలు ఎగసి పడ్డాయి. దీంతో ఈ ప్రాంత వాసులు అదిరిపడ్డారు. దీంతో బీఓపీ మూసి వేసి మంటలను అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. 1997లో రావులపాలెం దగ్గర్లోని దేవరపల్లిలో.. డ్రిల్లింగ్ స్టేషన్ లోని సైట్ లో బ్లో అవుట్ ఎగసిపడింది. విపరీతమైన శబ్ధంతో ఈ గ్యాస్ చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19న ఈ బ్లో అవుట్ వెలుగు చూడగా ఫిబ్రవరి 24 న అదుపులోకి తెచ్చారు.
2020లో కాట్రేని కోనకు దగ్గర్లోని ఉప్పూడిలో ఇక్కడి డ్రిల్లింగ్ సైట్ లో భారీ బ్లో అవుటు వెలుగు చూసింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరగులు దీశారు. ఓన్ జీ సీ నిపుణుల బృందం మూడు రోజుల పాటు శ్రమించి పరిస్థితి అదుపులోకి తీసుకురావల్సి వచ్చింది.
ఇక 2014లో గెయిల్ విస్ఫోటంలో 22 మంది మృత్యువాత పడ్డ ఘటన ఆంధ్రులంతా అదిరిపడేలా చేసింది. మామిడికుదురు మండలం నగరంలోని గెయిల్ కి చెందిన పైప్ లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోవడంతో పాటు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఇరుసమండ బ్లో అవుట్. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలీక ఈ ప్రాంత వాసులు గుండెలరచేత పట్టి పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు.