సిరాజ్ టాలెంట్.. రేవంత్ ముందే గుర్తించారు!
posted on Aug 6, 2025 @ 11:38AM
మహ్మాద్ సిరాజ్.. డీఎస్పీ సాబ్.. లండన్ లో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా చివరిదైన ఓవెల్ టెస్ట్ లో చారిత్రాత్మక విజయం తరువాత దేశ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ.. అందుకు తగిన విధంగా సిరాజ్ కు టీమ్ ఇండియాలో గుర్తింపు రాలేదు. ఇందుకు కారణం.. అద్భుత ఫిట్ నెస్, ఫామ్ ఉన్నప్పటికీ.. ప్రధాన బౌలర్ బుమ్రా నీడలో సిరాజ్ కు రావలసినంత గుర్తింపు రాలేదు. ఇండియన్ బౌలింగ్ అటాక్ గురించి ఎప్పుడు, ఎవరు మాట్లాడినా పేసర్ బుమ్రా, స్పీన్నర్లు అశ్విన్ ల పేర్లే ప్రస్తావిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే.. 2004లో సిరాజ్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో సీరాజ్ ను డీఎస్పీని చేశారు. తెలంగాణలో ఆయనకు డీఎస్పీ పోస్టు ఇచ్చి ప్రోత్సహించడం అప్పట్లో పలు విమర్శలు దారి తీసింది.
అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా సిరాజ్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చిన తరువాత అందరూ డీఎస్పీ అన్న పదాన్ని సిరాజ్ ఇంటిపేరుగా మార్చి సంబోధించడం మొదలు పెట్టారు. సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాదీ యువ క్రికెటర్ లోని టాలెంట్ ను, ఫైర్ ను గుర్తించి గౌరవించిందని ఇప్పడు అంతా అంటున్నారు. నేషనల్ హీరో సిరాజ్ ను తొట్ట తొలత గుర్తించి సముచిత రీతిలో గౌరవించిందని తెలంగాణ సర్కార్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
స్టార్ బౌలర్ బుమ్రా ఆబ్సెన్స్ లో జట్టు బౌలింగ్ భారాన్ని సిరాజ్ పూర్తిగా భుజానికెత్తుకుని టీమ్ ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడని వేనేళ్ల పొగడుతున్నారు. అన్నిటికీ మించి ఒక పేస్ బౌలర్ గా ఆయన తన ఫిట్ నెస్ ను, అంకిత భావాన్ని అనితర సాధ్యమన్న రీతిలో ప్రదర్శించారు. ఇంగ్లాండ్, ఇండియా ఐదు టెస్టుల సిరీస్ మొత్తంలో ఐదు టెస్టులూ ఆడిన ఏకైక పేస్ బౌలర్ గా నిలిచాడు. సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గానే కాకుండా అందరి కంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ గా కూడా నిలిచాడు.