కేటీఆర్ నోట జగన్ పాట.. రాబోయే పరాజయానికి ఇప్పటి నుంచే సాకుల వెతుకులాట?!
posted on Aug 6, 2025 @ 12:22PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలూ దాదాపు ఒకే పడవ మీద నడుస్తున్నాయా అనిపించక మానదు. ఈ పార్టీలు తమ తమ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడుతున్న మాటలూ దాదాపు ఒకేలా ఉన్నాయి. తాము గెలిచినప్పుడు ఈవీమ్ లు భేష్.. అదే ఒటమి రాగానే ఈవీఎంల ట్యాంపరింగే పరాజయానికి కారణమంటూ గగ్గోలు పెట్టే విషయంలో ఈ రెండు పార్టీలూ ఒకే పాట పాడుతున్నాయి.
2024 ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలతో మిగిలింది. పరిశీలకులైతే.. ఈ 11 స్థానాలైనా.. రాష్ట్రంలో పొత్తు కారణంగా కొన్ని స్థానాలలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టక తప్పని పరిస్థితి కూటమి కూటమి పార్టీలకు రావడం వల్లనే వచ్చాయంటారు. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగానే వైసీపీకి ఆ 11 స్థానాలైనా దక్కాయనీ, లేకుంటే కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటే అవకాశం ఉండేది కాదనీ చెబుతున్నారు.
అయితే ఈ వాస్తవాలనన్నిటిని విస్మరించి జగన్ ఈవీఎంల ట్యాంపరింగే తమ పార్టీ ఓటమికి కారణం అంటుంటే.. బీఆర్ఎస్ ఓటమి తరువాత దాదాపు రెండేళ్లకు అదే పాట ఎత్తుకుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఓడిపోవడానికి ఆయా పార్టీలు అధికారంలో ఉండగా అనుసరించిన విధానాలు, అవినీతి, అరాచకాలు, పాలనా లోపాలే కారణమన్నది నిర్వివాదాంశం. ఈవీఎంల వల్లే ఓడిపోయామంటే.. ఆ పార్టీలు గతంలో తమ విజయాలు కూడా ఈవీఎంల వల్లే వచ్చాయని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అయితే రెండు పార్టీలూ కూడా విజయాలు తమ ఘనత, పరాజయం ఈవీఎంల వల్ల అంటూ చెప్పుకుంటున్నాయి. తమ పాలనా వైఫల్యాలను అంగీకరించడానికి వాటికి అహం అడ్డొస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే విజయం తమదే అంటూ జగన్ పాట అందుకున్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర ఎన్నికల కమిషనర్ ను బుధవారం (ఆగస్టు 5) బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇక ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో బీఆర్ఎస్, వైసీపీలు ఒకే పాట పాడుతున్నాయి. అయినా 2014, 2019 ఎన్నికలలో ఈవీఎంలతో దక్కించుకున్న విజయాన్ని ఓన్ చేసుకున్న బీజేపీకి, అలాగే 2019 ఎన్నికలలో గెలుపొందిన వైసీపీకి.. అప్పుడు ఈవీఎంలపై లేని అభ్యంతరం పరాజయం తరువాత ఎందుకు వచ్చింది? అంటే.. రాబోయే ఎన్నికలలో పరాజయాన్ని ఇప్పుడే అంగీకరించి.. ఆ రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నాయా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.