వివేకా హత్య కేసులో అసలేం జరుగుతోంది?
posted on Aug 6, 2025 @ 11:13AM
వివేకా హత్య కేసులో తమ విచారణ ముగిసిందని సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది సీబీఐ. 2019 మార్చి 15న జరిగిన ఈ హత్య కేసు రెండు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. 2019లో టీడీపీని ఇరుకున పెట్టిన ఈ కేసు.. తర్వాత 2024 నాటికి వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. గూగుల్ టేకవుట్ అనే కొత్త పదాన్ని ఈ హత్య కేసే పరిచయం చేసింది. గూగుల్ టేకౌట్ ద్వారా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కార్నర్ అయ్యారు. ఇక భాస్కర్ రెడ్డి అయితే అరెస్టయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్టు అతి పెద్ద డ్రామాను తలపించింది. జగన్, భారతీ రెడ్డికి ఈ హత్య సమాచారం ఫలానా ఫలానా సమయాల్లో తెలిసిందన్న వార్తలు వెలుగు చూశాయి.
ఎందరో అధికారులు మారిన ఈ కేసులో.. తొలుత జగన్ పార్టీ చంద్రబాబును టార్గెట్ చేయగా.. తర్వాత తన హయాంలో ఈ కేసు విషయంలో వివేక కుమార్తె సునీత.. జగన్ నే ప్రధాన కారకుడిగా ఆరోపణలు చేశారు. ఇది కుటుంబ హత్యా లేక వ్యాపార లావాదేవీల మధ్య జరిగిన హత్యా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడం, అతడు అప్పుడప్పుడూ చేసిన సంచలన వ్యాఖ్యలు వంటివెన్నో నడిచాయ్.
వివేకాకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వస్తుందన్న కోణంలో ఈ హత్య జరిగిందన్నది ఒక వర్గం వాదన కాగా.. రెండో భార్య, ఆమె పిల్లలు ఆస్తిపంపకాల వ్యవహారంలో వచ్చిన తగువులాటలే కారణమంటూ మరొక వర్గం వాదన. బెంగళూరులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కమీషన్లలో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమన్నది మరో వర్షన్. కాదు.. రేపటి రోజున జగన్ అరెస్టయితే.. అధికారం భారతికి ఇవ్వాలా, షర్మిలకా అన్న విషయంలో .. వివేకా షర్మిళ వైపు నిలవడమే ఈ హత్య కారణమన్న వాదనా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు మీద వివేకం, హత్య అనే రెండు సినిమాలు రాగా.. వీటిలో హత్య అనే సినిమా వైసీపీ తీసినట్టుగా చెబుతారు. అయితే సినిమా క్లిప్పింగులను షేర్ కొట్టినా కేసులు పెట్టిన పరిస్థితులు.
ఒక వేళ కోర్టు మరేదైనా విచారణకు ఆదేశిస్తే తాము తదుపరి దర్యాప్తులోకి దిగుతామని సీబీఐ సుప్రీం కోర్టు ముందు విన్నవించుకుంది. మరి ఈ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? హత్యకు కారకులు వీరేనని ఏదైనా తేలుతుందా? వంటి అంశాలు ఉత్కంఠ భరితంగా మారాయి. ఇప్పటికున్న పరిస్థితులను బట్టీ చూస్తే ఈ కేసులో కావచ్చు, మద్యం కేసులో కావచ్చు జాతీయ దర్యాప్తు సంస్థలు జగన్ అండ్ కోను ఏమంత ఇబ్బంది పెడుతున్నట్టు కనిపించడం లేదు. దీంతో వివేకా కేసు విషయంలోనూ అనూహ్య పరిణామాలేవీ ఉండక పోవచ్చిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.