రేవంత్ కే చాన్స్.. సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం
posted on Dec 5, 2023 @ 12:32PM
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరునే ఖరారు చేసే చాన్స్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (డిసెంబర్ 6) లోగా తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని, అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. సోమవారం (డిసెంబర్ 4) నుంచి సీఎం ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. హైదరాబాద్‌లోని ఎల్జా హోటల్‌లో డి. శివకుమార్‌తో పాటు ఇతర పరిశీలకులు ఎమ్యెల్యేలతో విడివిడిగా కూడా మాట్లాడారు. ఆ తార్వత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకి హస్తినకు అంటే పార్టీ హైకమాండ్ కోర్టుకు చేరింది.
ఎల్జా హోటల్ లో ఎంపిక విషయంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం డీకే శివకుమార్ సహా హైకమాండ్ పంపిన పరిశీలకులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆ వెంటే సీఎం అభ్యర్థి పదవిని ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తాను తన ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించడానికి హస్తిన వెళ్లినట్లు చెబుతున్నా... ఇప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గేతోనూ, అంతకు ముందు డీకే శివకుమార్ తోనూ కూడా భేటీ అయ్యారు. అలాగే సీఎం పదవిని ఆశిస్తున్న మల్లుభట్టి విక్రమార్కకూడా హస్తిన చేరుకుని తన ప్రయత్నాలు తాను సాగిస్తున్నారు. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే టీపీసీసీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆరుసార్లు ఆయన ఎమ్యెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీపీసీసీ చీఫ్ గా కూడా పని చేశారు.
అలాగే మల్లుభట్టి విక్రమార్క సిఎల్‌పి నేతగా ఉన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే వారిరువురూ కూడా రేవంత్ రెడ్డిలా ప్రజాకర్షణ ఉన్న నేతలు కారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కాంగ్రెస్‌కు తెలంగాణలో విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగే స్థాయికి ఎదిగింది. అలాగే ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంలో రేవంత్ రెడ్డే ప్రధాన, కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నిర్వహించారు. అదే విధంగా అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. టీపీసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమాకాన్ని సీనియర్ నాయకులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆ తర్వాత అధిష్టానం సర్దుబాట్లు, బుజ్జగింపుల తర్వాత అందరూ ఐక్యంగా పనిచేశారు. అంతర్గత విమర్శలకు, పరస్పర విమర్శలకు స్వస్తి చెప్పి పార్టీ విజయానికి కృషి చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టడంలో సీనియర్లంతా విఫలమైన తరువాతే రేవంత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ బాధ్యతలను రేవంత్ కు అప్పగించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రేవంత్ దూకుడు ప్రదర్శించారు. కేసీఆర్ ను ఢీ కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను కూడగట్టడంలో విజయం సాధించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఒక్క సీటు కూడా ఆశించకుండా కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి రేవంత్ రెడ్డే కారణమనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డికి తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రేవంత్ తెలంగాణ సీఎం అయితే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటే.. ఇప్పటి లాగే తెలుగుదేశం ఓటు కూడా కలిసి వస్తుందన్న భావనా వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసిందనీ, అధికారిక ప్రకటనను కూడా ఇంకెంత మాత్రం జాప్యం చేసే అవకాశాలు లేవనీ పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ హై కమాండ్ అధికారిక ప్రకటన విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తే.. జనం కాంగ్రెస్ కల్చరే ఇంత అనే భావనకు వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తున్నది. అందుకే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న భట్టి, ఉత్తమ్ లను బుజ్జగించేందుకు మాత్రమే నిన్న అధికారికంగా రేవంత్ ఎంపికను ప్రకటించలేదని అంటున్నారు.