పీకే లా కుట్రలు కాదు.. వాస్తవాల ఆవిష్కరణే సునీల్ కనుగోలు వ్యూహాలు!
posted on Dec 5, 2023 @ 11:28AM
ఎట్టకేలకు తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడిన అధికార బీఆర్ఎస్ పార్టీని హస్తం మట్టి కరిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్ అధికారాన్ని అనుభవించగా.. ఇప్పుడు తొలిసారి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ను గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంలో కొన్ని బలమైన శక్తులు పనిచేశాయి. అందులో తొలిశక్తి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నామరూపాల్లేని పార్టీని ఒక సైన్యంగా మలచడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అన్నిటికీ మించి ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెంచారు. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం దక్కించుకునే స్థాయికి ఎదిగింది. ఇది రేవంత్ తోనే సాధ్యమైంది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు.
అయితే, ఇదంతా నడిపించిన మరో శక్తి ఉంది. ఆ మాస్టర్ మైండ్ పేరే సునీల్ కనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. అభ్యర్థుల ప్రకటన నుండి ఎగ్జిట్ పోల్స్ వరకూ ఏది ఎలా చేయాలో.. ఏ లెక్కన చేయాలో.. ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే. నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది. ఇక, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పేరు ఘనంగా వినిపించడం మొదలైంది. అసలు జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిలాంటి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు దొరకగా.. దానికి సునీల్ వ్యూహాలు తోడవడంతో నామినేషన్ల నుండి ప్రచారం వరకూ.. సభల నుండి స్పీచ్ ల వరకూ ప్రతిదీ కాంగ్రెస్ పార్టీలో కొత్తదనం కనిపించింది. దశాబ్దాలుగా మూసబారిన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు కొత్త పుంతలు తొక్కాయంటే అది సునీల్ తోనే సాధ్యమైంది.
తెలుగు ప్రజలకు ఎన్నికల వ్యూహకర్త అనగానే ప్రశాంత్ కిషోర్ ఒక్కడే తెలుసు. ఎందుకంటే మోడీ ప్రధాని అయిన దగ్గర నుండి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేవరకూ కీలకంగా పనిచేసిన పీకే అంటే అందరికీ నోటెడ్ అయిపొయింది. అందునా ఏపీలో వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్ తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్ తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభం మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. అయితే, సునీల్ అందుకు విరుద్ధం. ఇంకా చెప్పాలంటే సునీల్ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపుకోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి కూడా వెళ్ళలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకొనే ఛాన్స్ ఉన్నా ఆ ఊసేలేదు. ఏపీలో పీకే లాగా కోడికత్తుల్ని దించలేదు.. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే.. నిజాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా ప్రజల ముందుంచాడు.
చాపకింద నీరులా పనిచేసుకుపోయే తత్వం ఉన్న సునీల్ కనుగోలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని సరికొత్త పంథాలో తీసుకెళ్లారు. అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ తో ప్రచారం చేయించారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని, బీఆర్ఎస్ చేసిన ప్రతి తప్పును స్పష్టంగా అర్ధమయ్యేలా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి పంపించారు. ఎన్నికల ప్రచార చిత్రాలను వైవిధ్యంగా తెరకెక్కించి ఓటర్లను ఆకర్శించారు. ప్రజలను ఎలా ఓటర్లుగా మార్చుకోవాలో ప్రతి అభ్యర్థికి స్పష్టంగా నేర్పించారు. అంతే, ప్రజల ఉన్న అసంతృప్తి పదింతలైంది.. కాంగ్రెస్ అభ్యర్థులలో నమ్మకం వంద శాతం పెరిగింది. ఫలితంగా కాంగ్రెస్ విజయ తీరాలకు చేరింది. దీంతో ఇప్పుడు ఎక్కడ విన్నా సునీల్ కనుగోలు పేరే వినిపిస్తుంది.