తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన కేసిఆర్
posted on Dec 28, 2012 @ 12:09PM
ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. పెద్దగా సంచలన అభిప్రాయలేమీ ఇక్కడ వెలువడలేదు. ముందునుండి అనుకున్నట్లుగానే ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను తెలియచేసాయి.
తెలుగు దేశం పార్టీ తరపున మాట్లాడిన కడియం శ్రీహరి 2008 లో కేంద్రానికి ఇచ్చిన లేఖలోని అంశాలకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అన్నారు. అదే పార్టీ నుండి హాజరైన యనమల రామకృష్ణుడు తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియచేసారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సమావేశంలో పాల్గొన్న గాదె వెంకట రెడ్డి తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో, మంత్రి ఆయనను ఆపి అదే పార్టీకి చెందిన సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు.
తెలంగాణాఫై బిల్లు పెడితే, దానికి మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యెక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్ పార్టీ నుండి హాజరైన ప్రతినిధులు షిండే కు చెప్పారు. ఎంఐఎం పార్టీ తరపున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకించారు. ఒక వేళ విభాజించాల్సి వస్తే, రాయల తెలంగాణా ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిపిఐ కేంద్రాన్ని కోరింది. సిపిఎం మాత్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా తన నిర్ణయాన్ని తెలియచేసింది.
ఈ సమావేశం ఫలితంతో సంతృప్తి చెందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు రేపు తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చారు.