నేడే మీటింగ్
posted on Dec 28, 2012 3:57AM
అందరూ చాలా ఆసక్తితో ఎదురు చూసిన అఖిల పక్ష సమావేశానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందిన రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల నేతలు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. అన్ని పార్టీలు ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహానికి అనుగుణంగా తమ ప్రతినిధులకు తగిన శిక్షణ ఇచ్చి పంపిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీల లక్ష్యం ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడమేనని తెలుస్తోంది.
అసలు కాంగెస్ పార్టీ అభిప్రాయమేమిటో చెప్పాలని తెలుగు దేశం పార్టీ నిలదీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా తన అభిప్రాయాన్ని చెప్పాలని జగన్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. అలాగే, టిఆర్ఎస్,బిజెపి,సిపిఐ పార్టీలు కూడా ముందు కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేయాలని పధక రచన చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయకుండా,ఇతర పార్టీలను ఇబ్బందుల్లోకి ఎలా నేట్టాలో మాత్రమే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణా కోసమే పుట్టిన టిఆర్ఎస్ ఈ మూడు పార్టీలను ఇరుకున పెట్టి, 2014 ఎన్నికల్లో విజయ పధాన దూసుకుపోవాలని పధక రచన చేస్తోంది. ఏది ఎలా ఉన్నా, నేటి సమావేశం అనంతరం రాష్ట్ర రాజకీయాలు మరో సారి వేడేక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.