‘జగన్ ను విడుదల చేయకపోతే తిరుగుబాటు తప్పదు’
posted on Dec 27, 2012 @ 12:30PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి ని జనవరి నెలాఖరులోగా విడుదల చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి హెచ్చరించారు. చరిత్రలో ప్రజలు చేసిన తిరుగుబాటులను ఏ శక్తులూ అడ్డుకోలేకపోయారని హరి అన్నారు.
జగన్ ను జైలుకే పరిమితం చేయాలన్న కుట్రను భగ్నం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రజల్లోకి వచ్చి వారి ఆధారాభిమానాన్ని పొందడం చూడలేకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నేతఫై కక్ష కట్టాయని హరి అన్నారు. జగన్ దోషి అయితే తగిన ఆధారాలు చూపించాలే గానీ, దర్యాప్తు సంస్థలు, జుడిషియల్ విభాగాలు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల రాజు కూడా పాల్గొన్నారు.