ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
posted on Dec 11, 2025 @ 5:29PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఒక ముఖ్యమైన పరిణామంగా, ప్రభాకర్ రావు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సడలించింది. కేసులో కీలక విషయాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వారం రోజులపాటు పోలీసు కస్టడీ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలి. రేపటి నుంచి ప్రారంభమై వచ్చే ఏడు రోజులపాటు ఆయనను కస్టడీలో ఉంచుకుని విచారణ చేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.అయితే, విచారణ సమయంలో ఎటువంటి శారీరక లేదా మానసిక ఒత్తిడి, టార్చర్ చేయరాదని కోర్టు పోలీసులు మరియు సిట్ అధికారులను గట్టిగా హెచ్చరించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది.
కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి భోజనం, అవసరమైన మందులు అందేలా చూడాలని కూడా ఆదేశించింది. వారం రోజుల కస్టడీ పూర్తయ్యాక, విచారణలో వచ్చిన వివరాలను సుప్రీంకోర్టుకు సమగ్రంగా నివేదించాలని ఆదేశిస్తూ, అందిన సమాచారం ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో ప్రభాకర్ రావు పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని న్యాయ వర్గలు వెల్లడించారు...వారం రోజుల విచారణ అనంతరం మొత్తం వివరాలను కోర్టుకు సమర్పించాలని సిట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. కస్టడీ విచారణలో బయటపడే వివరాల ఆధారంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించారు.