రో-కోలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?
posted on Dec 11, 2025 @ 5:07PM
టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 - 25 సీజన్‌లో కోహ్లీ, రోహిత్ A+ కేటగిరీలో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2025-26 సీజన్ లో వీరిని A+ కేటగిరీ నుంచి గ్రేడ్ Aకి డిమోట్ చేసేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే వారి జీతంలో సుమారు రూ.2 కోట్లు తగ్గుతాయి.
డిసెంబర్ 22న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వార్షిక కేటగిరీల వారిగా ఫీజుల వివరాలు ఇప్పుడు చూద్దాం.. A+ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు రూ.7 కోట్లు, A కేటగిరి రూ.5 కోట్లు, B కేటగిరి రూ.3 కోట్లు, C కేటగిరిలోని ప్లేయర్లకు రూ. కోటి జీతం అందుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో నాలుగు కేటగిరిల్లో ఆటగాళ్లను విభజించి వారికి బీసీసీఐ జీతాలు అందజేస్తుంది.
టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్‌కు ఈ సారి A+ గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం గిల్ A కేటగిరిలో ఉండగా.. జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ఉన్నారు. డిసెంబర్ 22న జరిగే అపెక్స్ కౌన్సెల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల రెమ్యూనరేషన్ పెంపు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన అప్డేట్లు వంటి వాటిపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగిన బీసీసీఐ సంస్థాగత మార్పుల తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం.
బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి అపెక్స్ మీటింగ్ ఇదే. ఈ సమావేశంలో మిథున్‌తో పాటు ట్రెజరర్ రఘురాం భట్, కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, అపెక్స్ కౌన్సెల్ సభ్యుడు జయదేవ్ షా పాల్గొననున్నారు. మొత్తంగా వచ్చే సమావేశంలో ఒకవేళ కోహ్లీ, రోహిత్‌లను గనుక 'A' కేటగిరీ(రూ. 5 కోట్లు)కి తగ్గిస్తే, 'A+'కేటగిరి (రూ. 7 కోట్లు)తో వారిద్దరూ ఒక్కొక్కరు రూ. 2 కోట్లు తక్కువగా సంపాదిస్తారు.