బాబు వారసుడు లోకేశా? జూనియర్ ఎన్టీఆరా?
posted on Apr 1, 2011 @ 9:39AM
హైదరాబాద్: మూడు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ మూడో తరంలో ఎవరిని పిలుస్తుంది!? పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు!? చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు? నిజానికి, టీడీపీలో ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఆయన నాయకత్వానికి ఢోకా లేదు. ఎదురు తిరిగే వారెవ్వరూ లేరు. చంద్రబాబు ఫిట్‌నెస్ విషయంలో ఎవరికీ అనుమానాలూ లేవు. మరో రెండు ఎన్నికలను సైతం సునాయాసంగా ఒంటిచేత్తో ఎదుర్కోగల ఉత్తేజంతో ఆయన ఉన్నారు. అయినా, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్‌లలో టీడీపీ అధినేత వారసుడు ఎవరనే అంశంపై పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. తర్జనభర్జన కొనసాగుతోంది. చంద్రబాబు వారసుడి రేసులో ప్రధానంగా మూడు పేర్లు చర్చకు వస్తున్నాయి. వారిలో ఒకరు.. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అయితే.. మిగిలిన ఇద్దరూ లోకేశ్.. జూనియర్ ఎన్టీఆర్‌లు. అయితే, చంద్రబాబు నారా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నారా లోకేష్‌కు తన కూతురును ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తాను నాయకత్వం కోసం పోటీ పడకపోవచ్చునని అంటున్నారు. చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా ఆయన నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ దూసుకొస్తున్నారు. తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురును జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లి చేస్తున్న చంద్రబాబు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు అడ్డు రాకుండా ఈ పెళ్లి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ కార్యకర్తల నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు లభిస్తుంది. విశేష జనాదరణ ఆయనకు ఉంది. తాత స్వర్గీయ ఎన్టీ రామారావు లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. జనాదరణ విషయానికి వస్తే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడలేరు. కానీ ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తూ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.