ప్రభుత్వ చేతగాని తనంతోనే పెంపు: బాబు
posted on Apr 1, 2011 @ 9:42AM
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు గానీ, సరైన ప్రణాళిక గానీ లేనందునే విద్యుత్ రంగం సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్యూయల్ సర్‌చార్జీల పేరుతో వినియోగదారులపై ఏటా భారాన్ని మోపుతూనే ఉన్నారని తెలిపారు. ఏడాదిలోపే రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచడం ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే విద్యుత్ చార్జీలు పెంచడం ప్రభుత్వ పలాయనవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులపై రూ.3,678 కోట్ల భారాన్ని మోపి ఏడాది కాకుండానే మళ్లీ అన్ని వర్గాల వినియోగదారులపై రూ.650 కోట్ల మేరకు భారం మోపడం దగాకోరుతనమన్నారు. ఓవైపు ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతుంటే, విద్యుత్ చార్జీలు, పన్నులను పెంచడం దారుణమని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 6న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యుత్ కోతల కారణంగా రబీలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.