ముగ్గురి మధ్య హోరాహోరీ
posted on Apr 1, 2011 9:23AM
హైదరాబాద్: కడప లోక్ సభ సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి త్రిముఖ పోటీ ఖరారైనట్లే. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగడానికి రంగం దాదాపుగా సిద్ధమైనట్లే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్ సభ సీటు నుంచి వైయస్ జగన్‌ను, పులివెందుల శాసనభా నియోజకవర్గం నుంచి వైయస్ విజయమ్మ పోటీ పడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం తాజాగా మరోసారి ప్రకటించింది. వీరిని ఎదుర్కోవడానికి తగిన బలమైన అభ్యర్థుల కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఓడిపోయిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెసు అభ్యర్థులుగా పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి, కడప లోక్ సభ సీటు నుంచి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పోటీ చేస్తారని అనుకుంటూ వస్తున్నారు. అయితే, వదిన విజయమ్మ మీద పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వివేకానంద రెడ్డి మాత్రం ఆ విధమైన యోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనా మార్పు చేయదలిస్తే అధిష్టానం చేయాల్సిందే. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి తన నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఒక రకంగా కడప జిల్లాలో ఆధిపత్యం కోసం పోరాటం చేయాల్సిన అనివార్యతలో వివేకానంద రెడ్డి పడ్డారు. వైయస్ జగన్‌పై ఆధిక్యత సాధించడం ఆయన తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. అందువల్ల హోరాహోరీ పోరుకే ఆయన సిద్ధపడవచ్చు.