జగన్ కు గట్టిపోటీనివ్వనున్న టీడీపీ
posted on Mar 31, 2011 @ 4:42PM
కడప: చంద్రబాబు నివాసంలో జరిగిన వైఎస్‌ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల సమావేశం ముగిసింది. కడప లోకసభ, పులివెందుల ఉప ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరిపినట్టు తెలిసింది. మే 8 వ తారీఖున జరిగే కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాల్సిన అభ్యర్థులను టిడిపి దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు ఓట్లు చీలిపోతున్నందున తాము లాభపడతామని భావించిన టిడిపి బలమైన అభ్యర్థిని నిలపాలనే యోచనలో ఉంది. పులివెందుల శాసనసభనుండి బిటెక్ రవిని పోటీ చేయించే ఉద్ధేశ్యాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కడప పార్లమెంటు స్థానం నుండి కూడా జగన్‌ను ఎదుర్కొనడానికి బలమైన అభ్యర్థిని పెట్టాలని చూస్తోంది. కాంగ్రెసునుండి టిడిపిలోకి వచ్చిన సీనియర్ నాయకుడు మైసూరారెడ్డిని కడపనుండి పోటీ చేయించాలనే యోచనలో ఉంది. అయితే కందుల రాజమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి వారిని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ అభ్యర్థి దాదాపు ఖరారైనప్పటికీ, పార్లమెంటు అభ్యర్థిగా మాత్రం పై ముగ్గురిని పరిశీలిస్తోంది. పూర్తిగా పరిశీలించి పార్టీలో చర్చించిన అనంతరం ఏప్రిల్ 5వ తారీఖున అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా, కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక కోసం మండలానికి ముగ్గురు ఎమ్యెల్యేలను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.