సచిన్ ముందు లక్ష్యాలు
posted on Mar 31, 2011 @ 4:10PM
ముంబై: భారత్‌కు రెండో ప్రపంచ కప్ టైటిల్ సాధించి పెట్టాలనే సచిన్ టెండూల్కర్ కల ముంబై వాంఖడే స్టేడియంలో నెరవేరుతుందా అని లక్షలాది క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శనివారంనాటి శ్రీలంక, భారత్ మధ్య ప్రపంచ కప్ పోటీ ఫైనల్ మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచుకు సంబంధించి సచిన్ టెండూల్కర్ ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి - భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టడం, రెండోది - తన సెంచరీల సెంచరీని పూర్తి చేయడం. తన సొంత నగరంలో స్థానిక ప్రేక్షకుల ముందు ఈ రెండు లక్ష్యాలు సాధించాలనే పట్టుదలతో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. వచ్చే నెలలో 38 ఏళ్ల పడిలో పడుతున్న సచిన్ టెండూల్కర్ బ్యాటింగులో దాదాపు అన్ని ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. టెండూల్కర్ ఇప్పటి వరకు ఐదు ప్రపంచ కప్ పోటీల్లో ఆడాడు. ఆరో ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతున్న సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ రికార్డును సమం చేశాడు. ఈ ఆరో ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఫైనల్ చేరుకోవడానికి సచిన్ కీలక పాత్ర పోషించాడు. మరో ప్రపంచ కప్ పోటీలో అతను ఆడే అవకాశాలు లేవు. అద్భుతమైన విశ్వాసంతో ఉన్న శ్రీలంక జట్టును ఫైనల్ మ్యాచులో ఓడించడం అంత సులభమేమీ కాదు. సచిన్ టెండూల్కర్‌ను వందో సెంచరీ సాధించడానికి శ్రీలంక అనుమతిస్తుందా అనేది అనుమానమే. టెండూల్కర్‌ను లక్ష్యంగా చేసుకుని శ్రీలంక బౌలర్లు విజృంభిచవచ్చు. భారత్ లాగే శ్రీలంక కూడా రెండో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.