టీ-బిల్లుపై ఓటింగ్ ఉంటుందిట!
posted on Jan 12, 2014 @ 3:45PM
రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ ఉండదని తెలంగాణావాదులు, ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో సహా సమైక్యవాదులు ఇంతకాలంగా వాదిస్తున్నారు. అయితే ప్రజలకు ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. ఈ సందిగ్ధాన్ని తొలగిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లుపై చర్చ పూర్తయిన తరువాత ఓటింగ్ ఉంటుందని మొన్నప్రకటించారు. కానీ, అసలు చర్చే జరగకుండా ఓటింగ్ కోసం వైకాపా పట్టుబట్టడం సరికాదని ఆయన అన్నారు. ఇంతకాలం షిండే, దిగ్విజయ్ సింగ్ తదితరులు బిల్లుపై శాసనసభ్యుల అభిప్రాయాలు సేకరించడానికే తప్ప వారు బిల్లుని ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో శాసనసభకు పంపలేదని చెపుతూ వచ్చారు.
ఇప్పుడు స్పీకర్ బిల్లుపై ఓటింగ్ జరిపినట్లయితే, మెజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికే చెందివారు ఉన్నందున శాసనసభలో బిల్లు తిరస్కరింపబడే అవకాశాలే ఎక్కువ. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేందుకు మొగ్గు చూపే రాష్ట్రపతి శాసనసభ చేత తిరస్కరింపబడిన బిల్లుని తనవద్దే త్రొక్కిపెట్టి ఉంచదమో లేకపోతే కేంద్రాన్ని దానిపై సవరణలు, వివరణలు కోరడమో చేస్తే, బిల్లు బడ్జెట్ సమావేశాలలో కూడా ప్రవేశపెట్టడం అనుమానమే అవుతుంది. అందువల్ల ఒకవేళ స్పీకర్ బిల్లుపై ఓటింగ్ చెప్పట్టదలిస్తే, అది జరగకుండా తెలంగాణా సభ్యులు సభను స్తంభింపజేసి, జనవరి23న యధాతధంగా రాష్ట్రపతికి త్రిప్పి పంపే ప్రయత్నం చేయవచ్చును.
కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాక, ఎన్నికలలో తన రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజనకు పూనుకొన్నందునే, అందరి ఆమోదంతో ఒక సామరస్య వాతావరణంలో శాస్త్రీయంగా జరుగవలసిన రాష్ట్ర విభజన ప్రక్రియ, ఈవిధంగా అడుగడుగునా ప్రశ్నార్ధకంగా సాగుతోంది. అయినప్పటికీ దీనివలన కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందగాలదా అంటే అనుమానమే.