జైపాల్ రెడ్డి ఆరాటం దేనికో?
posted on Jan 12, 2014 @ 1:59PM
టీ-కాంగ్రెస్ నేతలందరూ ఏదో ఓ సమయంలో తెలంగాణా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారే. కానీ, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా తన పదవిని వదులుకోని జైపాల్ రెడ్డి, కనీసం ఏనాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు హటాత్తుగా డిల్లీ నుండి హైదరాబాదులో వాలిపోయి తెలంగాణా సాధన తన గొప్పదనమేనని, తెలంగాణాకోసం తాను తెర వెనుక ఎంతగా కృషి చేసినదీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత చెపుతానని శలవిస్తున్నారు. పనిలోపనిగా సీమాంధ్ర నేతలందరూ శుంటలని, ప్రజలు అమాయకులని ఆయన సర్టిఫికెట్స్ కూడా జారీ చేస్తున్నారు.
హైదరాబాదు అభివృద్ధి వెనుక రాష్ట్ర ప్రజలందరి సమిష్టి కృషి ఉందనే సంగతి అంగీకరించడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, తను మెట్రో రైలు, సిటీ బస్సులను తెచ్చానని గొప్పలు చెప్పుకొంటున్నారు. నగరం అభివృద్దే జరగకపోయి ఉండి ఉంటే, మెట్రో రైలు, ఏసీ బస్సులు అవసరం ఉండేవికావనే సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాదును దేశంలో ప్రధాన ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబు కూడా ఆయన నోటి ముందు బలాదూరే! జైపాల్ రెడ్డి ఇన్నేళ్ళు కేంద్రమంత్రిగా రాష్ట్రానికి, కనీసం తన తెలంగాణా ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా, తెలంగాణా ఏర్పాటవుతున్న సమయంలో నేడు అకస్మాత్తుగా ఊడిపడి, మిగిలిన టీ-కాంగ్రెస్ నేతలతో బాటు సీమాంధ్ర నేతలను దుమ్మెత్తి పోస్తూ ముఖ్యమంత్రి రేసులో అందరి కంటే ముందు నిలవాలని తహతహలాడుతున్నారు.
బహుశః వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గ్రహించడం వలననే ఆయన అకస్మాత్తుగా తెలంగాణా వైపు దూసుకు వస్తున్నారేమో. అధికారంలోలేని కేంద్రాన్ని పట్టుకొని వ్రేలాడటం కంటే, తెలంగాణా రాష్ట్ర ఏర్పడి అక్కడ కాంగ్రెస్ పార్టీ, తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వమయినా ఏర్పాటు చేయగలిగితే, దానికి తాను ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన కలలు కంటున్నారేమో! అందుకే ఆయన సీమాంధ్ర నేతలను, ప్రజలను కించపరిచేలా మాట్లాడుతూ తనను తాను తెలంగాణా హీరోగా ప్రమోట్ చేసుకొనేందుకు చాలా శ్రమ తీసుకొంటునట్లున్నారు. కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు లేదా విలీనం కానంత కాలం ఆయన ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోవడం ఖాయం.