ప్రయాణికులకు నరకం చూపిస్తున్నరవాణాశాఖ
posted on Jan 13, 2014 6:16AM
అమ్మ అన్నం పెట్టదు అడుక్కొని తిననివ్వదనట్లుంది మన ఆర్టీసీ, రవాణాశాఖవారి నిర్వాకం. పండుగ సందర్భంగా రద్దీ తట్టుకొనే శక్తి ఆర్టీసీకి లేదని తెలిసినప్పటికీ, రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను రోడ్ల మీద తిరగనీయకుండా అడ్డుపడుతూ పండుగకు స్వంత ఊర్లకు బయలుదేరుతున్నప్రజలకు నరకం చూపిస్తున్నారు. రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన జరిగిన తరువాత నుండి రవాణాశాఖ వారు ప్రైవేట్ బస్సులపై కొరడా జుళిపిస్తున్నారు బాగానే ఉంది. కానీ, ఇంతవరకు అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఉద్యమాల వలన తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ, ఇంత తక్కువ వ్యవధిలో అదనపు బస్సులను ఏర్పాటుచేసి ఈ లోటును భర్తీ చేయలేదని తెలిసికూడా రవాణాశాఖ ప్రైవేట్ బస్సులను రోడ్ల మీదకు రానీయకుండా కట్టడి చేస్తుండటంతో, దూరప్రాంతాల నుండి స్వంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రజలు రైళ్ళు, బస్సులు లేక నానా కష్టాలు పడుతున్నారు.
కానీ ఇదేమీ పట్టనట్లు రవాణాశాఖ అధికారులు ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని నిలిపివేస్తూ గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే విశాఖ, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 65 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు పట్టుకొని నిలిపివేసినట్లు సమాచారం.
పాలెం బస్సు ప్రమాదం జరగక ముందు అవే ప్రైవేట్ బస్సులు నిబందనలు పాటించకుండా తిరుగుతున్నపుడు మరి రవాణాశాఖ వాటిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు సంజాయిషీ ఈయవలసి ఉంది. ప్రతీ ఉల్లంఘనకీ ఎంతో కొంత జరిమానా వేసి ఖజానా నింపుకొంటూ, పనిలోపనిగా తమ జేబులు కూడా నింపుకొనేందుకు అలవాటు పడిన నేతలు, అధికారుల వలననే, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలలో కూడా నిర్లక్ష్యం పెరిగి, ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల ఈ ప్రమాదాలకు కేవలం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలే కాదు రవాణాశాఖ, ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది.
ఇంతకాలం నిబంధనలు గుర్తుకు రాని రవాణాశాఖ అధికారులకు పాలెం బస్సుప్రమాదంలో 45మంది ప్రయాణికులు మరణించిన తరువాతయినా అవి గుర్తుకు రావడం, వెంటనే రోడ్డునపడి ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని కేసులు వ్రాసేసి నిలిపివేయడం ఎవరూ తప్పు పట్టలేరు. నిబంధనలు అతిక్రమిస్తే తప్పకుండా శిక్షించవలసిందే. కానీ, అవే నిబందనలు ఆర్టీసీకి కూడా వర్తింపజేస్తే, నేడు రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరిగే అవకాశం ఉండదని వారికి తెలియదా? తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను నడుపుతుంటే పట్టించుకోని రవాణాశాఖ అధికారులు, ప్రైవేట్ బస్సులను మాత్రం పట్టుకోవడం ఏమిటి? అంటే, ఆర్టీసీ బస్సులు అటువంటి ప్రమాదాలకు అతీతమయినవనా లేక ఆర్టీసీకి అటువంటి నిబందనలు వర్తించవని వారి అభిప్రాయమా?
ఏమయినప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంత రద్దీ ఉంటుందో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులకు తెలియకపోలేదు. అయినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ బస్సులను కూడా పట్టుకొని నిలిపివేస్తూ ప్రయాణికులకు పండుగ ముందు నరకం చూపిస్తున్నారు. తాము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని వారు భావించవచ్చును. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈవిధంగా చేయడం బాధ్యతారాహిత్యమే.