జూబ్లీ బైపోల్.. కనిపించని సానుభూతి ఫ్యాక్టర్!?
posted on Oct 13, 2025 @ 12:35PM
తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్ ను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక కోసం నోటిషికేషన్ విడుదలైంది. వచ్చే నెల11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితంవెలువడుతుంది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి.. గ్రేటర్ పై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉండగా, తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజామోదం ఉందని రుజువు చేసుకోవడానికి ఈ ఉప ఎన్నిక ను అధికార కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. అంతర్గత విభేదాలు, ఆశావహుల అలకల ద్వారా ఎదురైన ఇబ్బందులకు అధిగమించి, అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకు పోవడానికి రెడీ అయ్యింది.
ఇక బీజేపీ కూడా జూబ్లీ బైపోల్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పట్ల జనం విసిగిపోయి ఉన్నారనీ, ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ వైపు చూస్తున్నారనీ చెప్పుకుంటున్న కమలం పార్టీ జూబ్లీ బైపోల్ లో విజయం ద్వారా 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న కలను సాకారం చేసుకోవడానికి పునాది వేసుకోవాలని భావిస్తున్నది. అయితే తెలంగాణబీజేపీలో కూడా అంతర్గత విభేదాలు, రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగానే నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. మరో వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో అధిష్ఠానం తెలంగాణ అభ్యర్థి ఎంపిక విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో విలువైన ప్రచార సమయాన్ని బీజేపీ కోల్పోతోంది.
ఇవన్నీ అలా ఉంచితే.. పరిశీలకులు మాత్రం ఈ ఉప ఎన్నికలో సానుభూతి ఫ్యాక్టర్ ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్ సానుభూతి ఫ్యాక్టర్ ను నమ్ముకుని పార్టీ టికెట్ ను దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సుజాతకు ఇచ్చింది. అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించేసింది. అయితే.. సానుభూతి ఫ్యాక్టర్ అన్నది కనిపించకపోవడంతో... బీఆర్ఎస్ ఆశలన్నీ రేవంత్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి బీఆర్ఎస్ సానుభూతి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో?