తుస్సు మంటున్న వైసీపీ ఆందోళనలు.. తెలుగుదేశంకూ తప్పని తలపోట్లు!
posted on Oct 11, 2025 @ 9:54AM
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెంచడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. నాన్ ఇష్యూస్ ను సైతం తీసుకుని ఆందోళనలకు పిలుపునిస్తోంది. అయితే వైసీపీ వాదనలు, ఆందోళనలను ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకూ పెద్దగా స్పందన కానరావడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా సేవలు, శాఖా సమీక్షలు, పింఛన్ పంపిణీల, ఇతర పథకాల అమలు ద్వారా ప్రజలకే చేరువకావడానికి ప్రయత్నం చేస్తుంటే.. వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మొత్తం వ్యవహారం అంతా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావడంగా పరిశీలకులు చెబుతున్నారు. అధికార తెలుగుదేశం సంక్షేమ, అభివృద్ధి నినాదంతో జనానికి చేరువకావడానికి ప్రయత్నిస్తుండగా, వైసీపీ ప్రజాహక్కులు అన్న నినాదంతో ప్రజలలోకి వెళ్లాలని చూస్తున్నది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 'పేదల సేవలో ప్రజా వేదిక' పేరిట ప్రతినెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఒకింత మసకబారుతున్న పరిస్థితీ కనిపిస్తోంది.
ఇక వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ చేపట్టిన ఆందోళన పెద్దగా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన నర్సీపట్నం పర్యటనకు జనం మొహం చాటయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చునని పరిశీలకులు అంటున్నారు. తన పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలు పేదలకు వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవనీ, చంద్రబాబు సర్కార్ వాటిని ప్రైవేటు పరం చేస్తున్నదని జగన్ చేస్తున్న ప్రచారానికి, ఆందోళనకు ప్రజామద్దతు పెద్దగా లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే కాలేజీల ప్రకటన వినా అవి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పాలి. అయినా కూడా వైసీపీ అక్టోబర్ 10 (శుక్రవారం) నుంచి వచ్చే నెల 22 వరకూ రచ్చబండ, అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, 12న జిల్లాస్తాయి ర్యాలీలు అంటూ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు మెమోరాండం సమర్పించాలని సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. వైసీసీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు చెక్కేయడంతో వీటికి సీరియస్ నెస్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అననిటికీ మించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పీపీపీ విధానానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, మెడికల్ పాలేజీల పీపీపీ విధానానినికి టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం అధికార పార్టీకి కలిసి వచ్చినట్లైంది. మొత్తంగా రాష్ట్రంలోని పరిస్థితి ప్రతిపక్షానికి ఇసుమంతైనా అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తున్న వ్యతిరేకత, ఆరోపణల కారణంగా ప్రభుత్వం పట్ల కూడా పెద్దగా సానుకూలత లేదని పరిశీలకులు అంటున్నారు.